ఆర్థికమాంద్యం నుంచి ప్రజలను బయట పడేయాలి !
కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం ఎంతకాలం ఉంటుందో అన్న భయాలు తొలగిపోతున్నాయి. కేసుల సంఖ్య 25వేల దిగువకు చేరుకోవడం..మరణాల సంఖ్య నామమాత్రంగా ఉండడం ఊరట కలిగించే అంశం. తొలి,మలి దశల్లో లాగా ఆస్పత్రులకు వెళ్లడం..లక్షలు ఖర్చుపెట్టి శవాలను తెచ్చుకున్న దుర్ఘటను లేకుండా పోయాయి. కరోనా వచ్చిందంటే మామూలుగా దగ్గు జలుబు స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటు న్నారు. ఈ క్రమంలో ఇక ఆర్థిక మాంద్యం తొలగి ప్రజలు మళ్లీ తమ పనులపై దృష్టి పెడుతున్నందున ప్రభుత్వాలు కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఉద్యోగాల కల్పన, ఉపాధి పథకాల పెంపు, బ్యాంకుల చేయూత తదితర విషయాల్లో ప్రభుత్వాలు సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పునరుజ్జీవ పథకాలను ప్రోత్సహించాల్సి ఉంది. ఇప్పటికే నిరుద్యోగం పెరిగి యువత ఆందోళనలో ఉన్నారు. అలాగే మందులు,ఇతర వస్తువుల ధరలు భారీగాపెరిగాయి. వీటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల నిత్య జీవన ఖర్చులు బాగా పెరిగినందున అందుకు తగ్గట్‌ఉలగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. నాలుగైదు నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడం ఆందోళన కలిగించింది. ఒమైక్రాన్ కొత్త వేరియంట్ విజృంభణతో మళ్లీ ఆంక్షల దిశగా అనేక దేశాలు పయనించాయి. ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కొన్ని దేశాలు పట్టణాల మధ్య రాకపోకలను కూడా నిషేధించాయి. అంతర్గత విమాన సర్వీసులను రద్దు చేశాయి. అంతర్జాతీయ విమనాశ్రయాలన్నీ జనాలు లేక బోసిపోయాయి. మరోమారు ప్రపంచం స్తంభిస్తే ఉత్పత్తి పడిపోవడం, వస్తు వినియోగం పెరిగే ప్రమాదం ఏర్పడుతుందా అన్న భయాలు వచ్చాయి. ఇక విదేశాల నుంచి వస్తున్న వారి కారణంగానే మనదేశంలో ఒమైక్రాన్ కరోనా సంఖ్య పెరుగడం ఆందోళన కలిగించింది. మూడు లక్షల వరకు పోయిన కేసుల సంఖ్య క్రమంగగా తగ్గుతూతగ్గుతూ ఇప్పుడు 25 వేలకు చేరుకోవడంతో ప్రజలు,ప్రభుత్వాల ఊపిరి పీల్చుకుంటున్నాయి. కరోనా తీవ్రత కారణంగా మార్కెట్ల పతనం కొనసాగింది. ఇంతకాలం అంటే గత రెండేల్లుగా కుంగిపోయిన రంగాలను పునరుద్దరించాలి. అందుకు అవసరమైన ఆర్థిక ప్యాకేజలీలు అందదించాలి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం తగ్గడం లేదు. ఇది కూడా మన ఆర్థిక వ్యవస్థకు భారంగానే చూడాలి. ఇప్పటికే వ్యాపార, వాణిజ్యాలు మొత్తం దెబ్బతింటున్నాయి. చిరు వ్యాపారులు ఆదాయం లేక చితికి పోయారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం ఇష్టం లేక ..గత్యంతరం లేక యధావిధిగా తమ జీవనా ధారం కోసం పనుల్లో దిగక తప్పడం లేదు. రానున్న రోజుల్లో పెట్రోల్,డీజిల్ ధరుల అందుబాటులో ఉంటాయా లేదా అన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు స్వారీ చేస్తున్నాయి. కరోనా కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించింది. కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. ఆయా దేశాలు తమవంతుగా ఆర్థికవృద్దికి చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పనిగంటలు, వేతనాల కోతలకు దారితీసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఆర్థికవృద్ది చర్యలకు ఊతమియ్యాలి. ఉపాధి రంగాలకు విరివిగా రుణాలు అందివ్వాలి. రైలు, విమానయాన రంగాలను పటిష్టంగా ముందుకు తీసుకుని పోవాలి. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేలా చూడాలి. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనువుగా నిర్ణయాలు తీసుకోవాలి. సెకండ్ వేవ్ సృష్టించిన విపత్తును తలచుకుంటేనే జనం వణికి పోతున్నారు. ఆక్సిజన్ లేమి, వైద్య సదుపాయాల కొరత, అరకొర టీకాలు ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేశాయి. ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు జనాన్ని వణికించాయి. తాజా వేరియంట్ అంత ప్రమాదకారి కాదని రుజువయ్యింది. అయితే జాగ్రత్తగా
ఉండాలని మరోవైపు వస్తున్న హెచ్చరికల మధ్య ప్రజలు నిత్య జాగగరూకతతో ఉండాలి. కోవిడ్‌తో కుటుంబాలకు కుటుంబాలనే పోగొట్టుకున్న అభాగ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే విషయంలో కేంద్రం పారదర్శకంగగా ఉండాలి. కేంద్రం ప్రేక్షక పాత్ర వహించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రజలకు అండగా నిలవాలి. గతంలో ఎదురైన పరిణామాల రీత్యా ముందస్తు సన్నద్ధతకు కేంద్ర ప్రభుత్వం వేగంగా కదలాల్సిన అవసరం ఉంది. పోషకాహారం విషయంలోనూ, ఆకలి సమస్యలోనూ మన దేశం ఎక్కడో అట్టడుగున ఉందని ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ సంస్థలు కుండబద్దలు కొట్టాయి. ప్రజల తలసరి ఆహార వినియోగం ఏడేళ్ల బిజెపి జమానాలో ఏకంగా తొమ్మిది శాతం తగ్గిపోయిందని ఎన్‌ఎస్‌ఎస్ సర్వే బట్ట బయలు చేసింది. కరోనా వేరియంట్లను ఎదుర్కోవాలంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి ఉండాలి. కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్న వేళ వారిలో ఇమ్యూనిటీని ఆశించడం వంచన. ఇకపోతే వేరియెంట్ ఏదైనా ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై దృష్టి సారించడంతోపాటు మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులను వేయించుకోవాలని సూచించారు. ఓవైపు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూనే సాధారణఱ జీవితం కోసం పనిచేసుకోక తప్పదు. అయితే మార్కెట్ª`లో అవకాశాలను పెంచాలి. అవివుంటే తప్ప ప్రజలు ముందుకు సాగలేదు. సరళీకరణ చర్యలతో ప్రజలక ఆర్థిక స్థితిగతులుపెరిగేలా చేయాలి. దేశ ఆర్థికరంగానికి ఇది దోహదపడేలా ఉండాలి. అవసరమైతే ప్రజలకు నగదు బదిలీలుల పెద్ద ఎత్తున చేపట్టాలి. బ్యాంకులు ఉదారంగగా ఉండేలా చూడాలి. ప్రజలు ముఖ్యంగా యువత కూడా ఉపాధిరంగాలను ఎంచుకునేలా చేయాలి. అప్పుడే కరోనా అనంతర దుష్ఫలి తాలను ఎదుర్కోగలం. ప్రజలు పనుల్లో పడితే.. ఉపాధి పనులు జరుగుతుంటే ఆర్థిక అసమనాతలు కొంతయినా తొలగిపోతాయి. ఆ దిశగా సత్వరచర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి.