ప్రజాసమస్యలపై కమ్యూనిస్టులు రాజీలేని పోరాటం
` అధికారంలో ఉన్నవారిని దించడంలోనూ ముందుంటారు
` వంటకంలో ఉప్పు లాంటి వారు…వారు లేకుంటే రాజకీయాలు లేవు
` దిగజారుతున్న జర్నలిజం విలువలు…సోషల్‌మీడియా పేరుతో అరాచకాలు
` నవ తెలంగాణ దశమ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):ప్రజాసమస్యలపైపోరాటంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని, వారిది రాజీలేనిపోరాటమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి తేవడానికి కమ్యూనిస్టులు ఉపయోగపడతారో లేదో విశ్లేషించలేను కానీ, అధికారంలో ఉన్నవారిని దించడానికి మాత్రం పనికొస్తారని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవ తెలంగాణ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తప్పు చేసేవాళ్లను గద్దె దించడంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా సిఎం అన్నారు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు. ఎన్ని మసాలాలు ఉన్నా.. ఉప్పు లేకపోతే వంటకు రుచి రాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలు ఉపయోగపడ్డాయి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే.. ఆనాడు విద్యుత్ ఉద్యమాలను లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కమ్యూనిస్టు సోదరులని నమ్ముతున్నానని అన్నారు.. 2023లో మేము అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీరభద్రం చేసిన పాదయాత్రలు, పోరాటాలు కారణం కావొచ్చన్నారు. ప్రజా పాలనను కొనసాగించడానికి కూడా విూ సహకారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదిలావుంటే సీసీనియర్ పాత్రికేయులు రాసిన విశ్లేషణలు మాకెంతో ఉపయోగపడతాయని తెలిపారు. వార్తా కథనాలను నిశితంగా గమనిస్తూ ఉంటానని అన్నారు. పరిపాలనపై పట్టు సాధించాలంటే విశ్లేషణలు చదవాలని, అన్ని అంశాలు ఒకే చోట క్రోడీకరించి విశ్లేషణలు రాయడం ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. అయితే జర్నలిజం విలువలు దిగజారుతున్నాయని, ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా కనిపిస్తున్నారని అన్నారు. ఇందులో ఎవరు ఏమిటో విూరే చెప్పాలన్నారు. జర్నలిజం డెఫినేషన్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్లు తమ బాధ్యతను మరవకూడదన్నారు. సోషల్ విూడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ విూడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని పాత్రికేయులకు సీఎం విజ్ఞప్తి చేశారు. వాళ్లు, విూరు ఒక్కటి కాదన్న భావనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ రోజు విూడియా, సోషల్ విూడియా, డిజిటల్ విూడియా ఎవరు పడితే వాడు జర్నలిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వారు కూడా నేను జర్నలిస్ట్‌ని అంటారన్నారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ విూడియా జర్నలిస్ట్ అంటున్నారు. పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు అదేదో వాళ్ల ఇంటిపేరు అయినట్టు- అంటూ వ్యాఖ్యానించారు. వాళ్ల తాతలు, ముత్తాతల నుంచి జర్నలిజంలోనే పుట్టి పెరిగినట్టు. జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్యా అని పెట్టు-కుంటు-న్నారు. వాడు ఎప్పుడైన జర్నలిజం స్కూల్‌లో చదివిండా? లేకపోతే ఓనమాలు మొత్తం అయినా వస్తాయా అంటే రెండూ రావు. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అయిన జర్నలిస్టులు ఉండేవాళ్లు. లేదా జర్నలిజం చదివిన వాళ్లకు ఈ బాధ్యతలు ఇచ్చే వాళ్లు. వాళ్ల పనితనాన్ని బట్టి వాళ్లకు బాధ్యత పెంచేవాళ్లు. కానీ ఈ రోజు అదేవిూ లేదు. రోడ్లవిూద ఆవారా గా తిరిగేటోడు .. ఎక్కువ తిట్లొచ్చినోడు, ఏందంటే అదే మాట్లాడేటోడే జర్నలిజం అనే ముసుగు తొడుక్కొని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయని ఆవేదన చెందారు. ఇలా జర్నలిజం ముసుగులో కొందరు ప్రెస్‌విూట్‌లు పెట్టినప్పుడు ముందు వరుసలో ధిక్కారంగా కూర్చుంటారు. మనమేదో లోకువ అయినట్టు-, వాళ్లేదే పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్లు- మన కళ్లలోకి చూస్తుంటారు. ఇంకా నన్ను చూసి నమస్కారం పెడతలేవు. నన్ను చేసి ఇంకా తల వంచుకుంటలేవు అని చూస్తుంటాడు. స్టేజీ దిగిపోయి పల్ల పల్ల చెంపలు పగులగొట్టాలని నాకు అనిపిస్తది. కానీ, పరిస్థితులు, హోదా అడ్డం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి, సీపీఎం సీనియర్ నేతలు రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
హైదరాబాద్(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. భాజపా ఫిర్యాదుతో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల భాజపా పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.