ఆర్‌ఎం చర్యలకు నిరసనగా నేడు దీక్ష

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):

ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్‌ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని టీఎంయూ నేతలు ఆరోపించారు. ఆర్‌ఎం వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా బుధవారం బస్టాండ్‌లోని ఆర్‌ఎం ఛాంబర్‌ ఎదుట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు టీఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎస్‌చారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న టీఎంయూ కార్మికులు దీక్షకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎం ఇకనైనా కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే 14వ తేదీ తరువాత సమ్మెలోకి వెళతామని పేర్కొన్నారు.ఒక్క మార్చి నెలలోనే ఆయా డిపోల్లో 20 మంది కార్మికులను అకారణంగా సస్పెండ్‌ చేశారని వాపోయారు. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగ కార్మికులు ఎక్కడైనా 8 గంటలే విధులు నిర్వహించాలని చట్టాలు చెబుతుండగా ఆర్టీసీలో మాత్రం ప్రతి కార్మికుడు 16 గంటలు పనిచేస్తున్నారని, అయినా కార్మికులకు సరైన అలవెన్సులు రావడం లేదన్నారు. కార్మిక సమస్యలపై జనవరిలో మహాధర్నా చేయగా సమస్యల పరిష్కారానికి హావిూ ఇచ్చిన ఆర్‌ఎం ఇచ్చిన హావిూల్లో ఏఒక్కటీ పరిష్కరించలేదని, కొత్త సమస్యలతో కార్మికులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.