ఆలం విడుదలపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి): కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరాత్‌ ఆలం విడుదల అంశం పార్లమెంట్‌ ఉభయసభలను కుదిపాయి. దీనిపై కాంగ్రెస్‌ సహా అన్ని పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ దేశ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడుతోందని మండిపడ్డారు. మసరాత్‌ ఆలం విడుదలపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. ఇలాంటి దేశ ద్రోహులను విడుదల చేయడం మంచిది కాదని అన్నారు. ఆలం విడుదలపై మధ్యాహ్నం 12 గంటలకు ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమాధానం చెబుతారని స్పీకర్‌సభ్యులకు తెలిపారు. అయితే దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరాత్‌ ఆలం విడుదల అంశంపై సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ సభను ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు.