ఆలయంలో అభివృద్ధి పనులు దేవుడెరుగు.. కనీస వసతులు కరువు…
వేములవాడ, ఆగస్టు 26 (జనంసాక్షి): పేదల దేవుడిగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు చేస్తానంటూ చెబుతూ అధికారులు కనీస వసతుల కల్పన మరిచారు. స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు దివ్యాంగులతో పాటుగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం వస్తుంటారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది ఎప్పటికప్పుడు విధులు నిర్వహించాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు, వీఐపీల సేవలోనే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆలయంలో సామాన్య భక్తుల సౌకర్యాల ఏర్పాటులో అధికారుల తీరుపై భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగురాలైన హుజురాబాద్ కు చెందిన నడవలేని స్థితిలో ఉన్న భూధవ్వ శనివారం స్వామివారి దర్శనానికి రాగా ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు వీల్ చైర్ అందించి చేతులు దులుపుకున్నారు. కాగా ఆలయంలో ఎటు వెళ్లాలన్న ర్యాంప్ సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంప్ ఏర్పాటు లేకపోవడంతో భూదవ్వతో పాటుగా వీల్ చైర్ ను మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కనీసం ఇప్పటికైనా ఆలయ పర్యవేక్షణ అధికారులు వారికి సంబంధించిన విభాగాలలో భక్తులకు సౌకర్యాల కోసం కృషి చేసి ఇబ్బందులు తొలగేల చూడాలని భక్తులు కోరుతున్నారు.