ఆలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు
మెదక్,ఫిబ్రవరి14(జనంసాక్షి): శివరాత్రికి జిల్లాలో ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు చేపట్టారు. ఏడుపాయల,కేతకి సంగమేశ్వరస్వామి, వర్గల్ సరస్వతీ ఆలయంతో పాటు పలు ఆలయాల్లో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఏడుపాయలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేతకి సంగమేశ్వర ఆలయంలో ఈ నెల 14 నుంచి 22 వరకు నిర్వహించే శివరాత్రి నవాహ్నిక ఉత్సవాల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఈవోపీఆర్డీ మహేశ్‌ను ఆదేశించారు. గుండంలోని నీటిని నాలుగైదు గంటలకోసారి తొలగించి కొత్త నీరు వదిలేలా చూడాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. ప్రధాన కూడళ్లు, మలుపుల వద్ద సూచికల ఏర్పాటు, జనం ఎక్కవగా ఉండేచోట తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు విద్యుత్తు, ఆరోగ్య, తాగునీరు, పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు.ఏడుపాయల జాతరను పురస్కరించుకుని సింగూర్ ప్రాజెక్టు నుంచి 0.30 టీఎంసీల నీటిని శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశామని సంగారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ నీరు ఘనపూర్ ఆనకట్టకు ఆదివారానికి చేరే అవకాశం ఉందని చెప్పారు.