ఆలయాల అభివృద్దికి పెద్దపీట
కరీంనగర్,ఫిబ్రవరి24(జనం సాక్షి): రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 23 వ డివిజన్ సుభాష్ నగర్‌లో రూ. 25 లక్షల నిధులతో పోచమ్మ ఆలయ కాంపౌండ్ వాల్, బోరు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. మొదటగా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి తెలంగాణ ప్రజల ఇలవేల్పు అని.. ప్రజలంతా గ్రామ దేవతగా కొలుచుకుంటారని అన్నారు. నగరంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ అర్ష కిరణ్మయి, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ దిండి గాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.