ఆలేరునుంచి స్వతంత్ర అభ్యర్థిగా..  బరిలోకి దిగుతున్నా

– నియోజకవర్గ ప్రజల కోరికమేరకే పోటీ
– నా జీవితానికి ఇవే చివరి ఎన్నికలు
– నేడు ‘ఎన్నికల శంఖారావం’ సభతో ప్రచారం ప్రారంభం
– విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి నర్సింహులు
యాదాద్రి, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : ఆలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. బుధవారం మోత్కుపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలేరు ప్రజల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. తనకు నియోజకవర్గంలో మద్దతుగా ప్రజలు ఉన్నారన్నారు.  ప్రజల సహకారంతోనే తాను గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గురువారం యాదగిరిగుట్టలో ఎన్నికల శంఖారావం సభ నిర్వహించనున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు సాధించడమే లక్ష్యమన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని.. ప్రజా సేవకుడినని మోత్కుపల్లి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించే సభ ఏర్పాట్లను తన మద్దతు దారులతో కలిసి మోత్కుపల్లి పరిశీలించారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా టీడీపీలో సీనియర్‌నేతగా, మంత్రిగా వ్యవహరించిన మోత్కుపల్లి.. చంద్రబాబు వ్యవహారంతో విభేదించి ఆయనపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా అనంతరం వివిధ పార్టీల్లో ఆయన చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య జనసేనాలో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.  గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మోత్కుపల్లి కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క చేతిలో ఓటమి పాలైయ్యారు. టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న సమయంలో కేంద్రంలో చంద్రబాబు సహాకారంతో ఏదోఒక పదవి వస్తుందని ఆశించిన మోత్కుపల్లికి.. చివరి నిమిషంలో ఎలాంటి పదవిరాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందారు. కాగా అప్పటినుండి వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై మోత్కుపల్లి మాటల దాడి చేసుకుంటూ వస్తున్నారు.