ఆలేరులో ప్రచారం

దూకుడు పెంచిన కాంగ్రెస్‌
యాదాద్రి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లాలో పార్టీల అభ్యర్తుల ప్రచారం పెరిగింది. ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఆలేరు నిజయవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలని, గెలిపించాలని అంటున్నారు. మరోవైపు టిఆర్‌ఎస్‌ అబ్యర్థి గొంగిడి సునీత, కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యల ప్రచారంతో వేడెక్కింది. ఇకపోతే ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మోత్కుపత్తలి అంటున్నారు. 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మెడలు వంచి ఆలేరుకు గోదావరి జలాలు రప్పించి ప్రజల రుణం తీర్చుకుంటాన్నారు. యాదాద్రి జిల్లాను సాధించి ఇక్కడి ప్రజలకు అంకితం చేశానని, ఇదే స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించి జనగామ జిల్లాలో విలీనం చేసిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి జిల్లాలోకి చేర్చుతానన్నారు. దళితులు ఒక్కటిగా సాగాలని, టీఎమ్మార్పీఎస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఏకమై హక్కుల సాధనకు ఉద్యమించాలన్నారు. ఈనెల 14న ఆలేరులో జరగునున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, తెదేపా పొత్తుతో తెరాసకు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి భిక్షమ్య గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తీసిన కాల్వల్లో కనీసం కంపచెట్లు తీయనివారు తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాలన చేయలేని అసమర్థ ప్రభుత్వం తెరాస అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన అనంతరం అందరూ కలిసి పార్టీకి విజయాన్నందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధి శూన్యమని బూడిద భిక్షమయ్యగౌడ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పేదలందరికీ ఏడాదికి ఆరు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.