ఆశలు అవిరి చేసిన పెన్‌గంగ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగ నది అప్పుడే అడుగంటుకుపోవడంతో.. రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వేసవి కాలానికి ముందే
మహారాష్ట్ర ప్రభుత్వం ఈసాపూర్‌ డ్యాం ద్వారా నీటి విడుదలను నిలిపివేసింది. దీంతో దిగువకు నీటి ప్రవాహం లేక నది ఎడారిగా తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నీటి లభ్యత లేక రబీ సాగు ప్రశ్నార్థకంగా
మారుతోంది. నది నీటినే నమ్ముకుని సాగు చేసిన పంటలపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పోయినట్టేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తోంది. ఇక కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు బోరు బావులు తవ్వుతుండగా మరికొందరు పెన్‌గంగా నదిలోనే బావులు తవ్వుతూ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.  అసలే అంతంత మాత్రంగా జలవనరులు ఉన్న జిల్లాలో సరిహద్దు గ్రామాల రైతులు ఎక్కువగా ఈ నది పైననే ఆధారపడి పంటలను సాగు చేస్తుంటారు. సుమారుగా 100 కిలోవిూటర్ల మేర ప్రవహించే పెన్‌గంగ భీంపూర్‌ మండలంలో ప్రవేశించి బేల మండలంలో జిల్లా సరిహద్దులను దాటిపోతుంది. నదివెంట ఉన్న భీంపూర్‌, తలమడుగు, తాంసి, జైనథ్‌, బేల మండలాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులు ఈ నది నీటి ఆధారంగానే వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తారు. ఎలాగో ఖరీఫ్‌ను గట్టెక్కిన రైతులు ఎన్నో ఆశలతో రబీలో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా శనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, కూరగాయల సాగును చేపట్టారు. ఇప్పటికే శనగ పంట, చేతికి వచ్చిన జొన్న, నువ్వు, మొక్క జొన్న, వేరుశనగ, ఇతర పంటలకు సకాలంలో నీటి తడులు అందక ఎండు ముఖం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

తాజావార్తలు