ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌

7వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం
సత్తాచాటిన భారత్‌ బౌలర్లు
కౌలాలంపూర్‌, జూన్‌9(జనం సాక్షి ) : భారత మహిళల జట్టు ఆసియా కప్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా శనివారం భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. దీంతో పాక్‌పై భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచిన పాక్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి పాక్‌ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఓపెనర్‌ నైన్‌ అబిది పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాటపట్టింది. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన ఆటగాళ్లు ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. నహీద ఖాన్‌ (18), సనా మిర్‌(20) మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. భారత బౌలర్‌ ఏక్తా బిస్త్‌ పాక్‌ బ్యాట్స్‌విమెన్‌ను బెంబేత్తించింది. నాలుగు ఓవర్లు వేసిన బిస్త్‌ 14 పరుగులిచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. శిఖా పాండే, అనూజ పాటిల్‌, పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. నిర్ణీత ఓవర్లలో పాక్‌ ఏడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. 73పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ మిథాలీ రాజ్‌ పరుగులేవిూ చేయకుండానే పెవిలియన్‌ బాటపట్టింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ కూడా డకౌట్‌గా వెనుదిరిగింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. వీరిద్దరూ కలిసి మ్యాచ్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. చివర్లో స్మృతి(38) ఔటైనా హర్మన్‌ బౌండరీతో భారత్‌కు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌… 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించి ్గ/నైల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఫైనల్‌ జరగనుంది. టోర్నీలో భాగంగా శనివారం మలేసియా-బంగ్లాదేశ్‌ మధ్య మరో మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి మరో జట్టు ఫైనల్‌కు చేరనుంది.