ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద శాంతిమందిరం
సందేశానికి ముస్తాబు
మెదక్, డిసెంబర్ 24 (జనంసాక్షి): మెదక్ కెథడ్రల్ చర్చి… వాటికన్ తరువాత ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి ఇది. కల్లో జగతికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడి మందిరమే కాదు.. ప్రశాంతతకు నిలయమైన మహాదేవాలయం, యూరవ్ గోతిక్ శైలిలో రూపుదిద్దుకొన్న ఈ ఆలయం ఓ కళాఖండం. ఆపై ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న పర్యాటక కేంద్రం. దేశ, విదేశీ పర్యాటకులు ఈ చర్చి సందర్శనకు రావడం దీని ప్రాధాన్యత, ప్రత్యేకతలకు నిదర్శనం. ఎప్పటిలాగే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ పరిధిలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నుంచి సుమారు లక్షమంది క్రిస్మస్ వేడుకలకు ఇక్కడికి తరలివస్తారు. ఈ మేరకు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవ మిషనరీ యంత్రాంగం అన్ని ఏర్పాటు
చేసింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగుగంటలకు తొలి ఆరాధనతో చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఆరంభమవుతాయి.
ఆనాడే పనికి ఆహారం!
అత్యద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో అత్యంత సుందరంగా రూపుదాల్చిన మెదక్ చర్చి నిర్మాణం వెనుక ఓ గొప్ప ఆలోచన ఉంది. ఓ ఉన్నతమైన ఆశయం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఈ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. కరువు కారణంగా ఉపాధి కరువై తినడానికి తిండి లేక ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోయారు. ఆ సమయంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చి మెదక్ ప్రాంతంలో సువార్త సేవలందిస్తున్న క్రైస్తవ గురువు ‘చార్లెస్ వాకర్ ఫాస్మెట్’ పేదల బాధలు చూసి చలించిపోయారు. అన్నార్తులను ఆదుకోవాలన్న సదాశయంతో పాటు.. సర్వమానవాళి పాపాలను తన భుజాలపై మోసిన కరుణామయుడి ఏసుక్రీస్తుకు ఓ మందిరం నిర్మించాలన్న ఆలోచనతో ఆయన మెదక్‌లో చర్చి నిర్మాణానికి పూనుకొన్నారు. ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఆయన దేవాలయ నిర్మాణానికి అవసరమైన వనరులు సమకూర్చారు. పనికి ఆహారం ప్రాతిపదికను చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై 1924వరకు పదేళ్ల పాటు కొనసాగింది. వేలాదిమంది కార్మికులు ఎంతో మంది నిర్మాణ రంగ నిపుణులు ఏళ్ళ తరబడి శ్రమించి దీనిని సుందరంగా నిర్మించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉంటంతో పాటు చారిత్రక ప్రాధాన్యం గల మెదక్ కెథడ్రల్ చర్చి ఆసియా ఖండంలో అతిపెద్ద రెండో చర్చిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ అందాల మందిరం ఆధ్యాత్మికతకు నెలవుగా వెలుగొందుతూ, అన్ని వర్గాల వారిని ఆకట్టుకొంటూ మతసామరస్యాన్ని చాటుతోంది.
వైవిధ్యమైన కళానైపుణ్యం
ఈ చర్చిలోని అద్దాల కిటికీలు చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. చర్చిలో మూడువైపులా రంగురంగుల స్టెయిన్డ్ గ్లాసు ముక్కలతో రూపొందించిన కిటికీలు క్రీస్తు జన్మవృత్తాంతాన్ని కన్నుకుల కడతాయి. ఇంగ్లాండ్ చిత్రకారుడు ఫ్రాంక్ ఓ సాలిస్‌బరి ఎంతో సృజనాత్మక నైపుణ్యంతో కళాత్మకంగా వీటిని రూపొందించారు. మూడ కిటికీల్లో క్రీస్తు జీవిత గాధను నిక్షిప్తం చేయడం విశేషం. ఒక కిటికీలో క్రీస్తు జన్మవృత్తాంతం… రెండో కిటికీలో శిలువపై బలిదానం.. మూడో కిటికీలో పునరుత్థాన ఘటం… కనువిందు చేస్తాయి. ఈ అద్దాల కిటికీల్లో ఏసుక్రీస్తు, మేరిమాతతోపాటు ఆనాటి రాజు, జ్ఞానులు, సైనికులు, గొర్రెల కాపరులు తదితరుల చిత్రాలు ఆనాటి వేషధారణతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బయటనుంచి సహజమైన సూర్యకాంతి ప్రసరించినపుడు మాత్రమే చిత్రాలు అగుపించడం ఈ అద్దాల కిటికీల ప్రత్యేకత.