ఆసీస్ దెబ్బకు విండీస్ విలవిల

s-88మెల్బోర్న్:మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ విలవిల్లాడుతోంది. తొలుత ఆసీస్ కు భారీ స్కోరు సమర్పించుకున్న విండీస్.. ఆ తరువాత బ్యాటింగ్ లో కూడా పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా ఆదివారం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్ 43.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 91 పరుగులతో ఎదురీదుతోంది.

విండీస్ ఆటగాళ్లలో క్రెయిగ్ బ్రాత్ వైట్(17), రాజేంద్ర చంద్రికా(25),శామ్యూల్స్(0), బ్లాక్ వుడ్(28), రామ్ దిన్(0), జాసన్ హోల్డర్(0) లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్ కు క్యూకట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి డారెన్ బ్రేవో(13 బ్యాటింగ్), కార్లోస్ బ్రాత్ వైట్ (3 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. మరోవైపు 460 పరుగులు వెనుకబడి ఉన్న విండీస్ కు ఫాలో ఆన్ ప్రమాదం పొంచి వుంది. ఆసీస్ బౌలర్లలో ప్యాటిన్సన్, పీటర్ సిడెల్, నాథన్ లాయన్ లు  తలో రెండు వికెట్లు తీసి విండీస్ వెన్నువిరిచారు.

అంతకుముందు 345/3 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా 551 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్(134 నాటౌట్), వోజస్(106 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. శనివారం తొలి రోజు ఆటలో బర్న్స్(128), ఖవాజా(144) లు సెంచరీలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ ఏడాది 100 పరుగులలోపు ఆరు వికెట్లను చేజార్చుకోవడం విండీస్ కు ఇది నాల్గోసారి కావడం గమనార్హం. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన ఆసీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.