ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

వరంగల్ నగరం హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేషెంట్ల వార్డులో షార్ట్ సర్య్కూట్‌ తో ఆక్సిజన్ సిలిండర్ పేలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆస్పత్రి రెండవ అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో పేషెంట్లు, వారి సహాయకులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కొందరైతే కిటికీ అద్దాలు పగుల కొట్టి బయటపడ్డారు. ఆస్పత్రి సిబ్బంది సహాయంతో.. ఎమర్జెన్సీ వార్డుల్లోని పేషెంట్లను బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పేషెంట్లు చనిపోగా… పలువురు గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఎమర్జెన్సీ వార్డుల్లోని రోగులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మొత్తం 199 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఐసీయూలో కుమారస్వామి అనే రోగి మంటల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మల్లమ్మ అనే మరో పేషంట్‌ కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను  ఎంజీఎంకు తరలించి అత్యవసర చికత్స అందించారు. ఐనా.. ఆమె మృతి చెందింది.

ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని పేషెంట్లు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసుల సాయంతో అందరినీ బయటకు తీసుకువచ్చారని తెలిపారు.

అగ్ని ప్రమాదం విషయం తెలియగానే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హుటాహుటిన   ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, సీపీ సుధీర్ బాబు తో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కడియం ఆదేశించారు. రోహిణి ఆస్పత్రి నుంచి తరలించిన రోగులకు సత్వర వైద్యం అందించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కడియం శ్రీహరి ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాలతో  కలెక్టర్ అమ్రపాలి స్వయంగా రోగులకు వైద్యం అందించడంపై సమీక్షించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని అన్ని ఆస్పత్రులకు రోగులను తరలించి.. సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు.

రోహిణి ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనలో తరలించిన రోగులందరికీ వైద్య చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ ఆమ్రపాలి చెప్పారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆస్పత్రిని మూసివేశామన్నారు. విద్యుత్‌ సహా అన్ని వ్యవస్థలను షట్ డౌన్ చేసి.. అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదానికి కారణాలు రేపటికి తెలుస్తాయన్నారు ఆమ్రపాలి.

ప్రమాద ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. నలుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు. కమిటీ సభ్యులుగా సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వేణుగోపాల్, హన్మకొండ ఏసీపీ మురళీధర్, సుబేదార్‌ పీఎస్‌ సీఐ శ్రీనివాస్‌తోపాటు అగ్నిమాపక అధికారిని నియమించినట్లు చెప్పారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు.

తాజావార్తలు