ఆహార కల్తీ కి పాల్పడితే కఠిన చర్యలు – జిల్లా ఆహార భద్రత అధికారి వేణుగోపాల్.

తొర్రూరు:17అక్టోబర్ (జనంసాక్షి )
దుకాణాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో చెడిపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత అధికారి పి. వేణుగోపాల్ అన్నారు.
ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఐపిఎం డైరెక్టర్ ఆదేశాల మేరకు
సోమవారం డివిజన్ కేంద్రంలోని పలు దుకాణాలు, మిఠాయి కేంద్రాలు, బిర్యాని సెంటర్లు, హోటళ్లల్లో  జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్చార్జి డాక్టర్ వింజమూరి సుధాకర్ తో కలిసి జిల్లా ఆహార భద్రత అధికారులు తనిఖీ  చేపట్టారు.
అనుమానం ఉన్న ఆహార పదార్థాల నమూనాలు తీసుకున్నారు.
సందర్భంగా జిల్లా ఆహార భద్రత అధికారి మాట్లాడుతూ.ప్రజలు నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో ( పాలు,  పండ్లు, నెయ్యి, మసాల దినుసుల్లో)  కల్తీ నానాటికి పెరిగిపోతుందన్నారు.
ఆహార కల్తీ నిరోధించేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు.
తినుబండారాలు ఆహార కల్తీ పై సమాచారం అందితే టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
పలు హోటళ్లు, దాబాలు, స్వీట్ సెంటర్లలో కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. అనుమానం ఉన్న వాటిని శాంపిల్ తీసుకుని హైదరాబాద్ ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. శాంపిల్ ను పరిశీలించిన తర్వాత నివేదిక ప్రకారం బాధితులపై చర్యలు తీసుకొని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు కల్తీలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తనిఖీల్లో సిబ్బంది బాదావత్ నరేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు