ఆ పార్కుకు ఎప్పుడు చూసినా తాళమే..
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రాంత వాసులు ఎంతో సంతోష పడ్డారు. ఏకంగా ఐదు కోట్లు రూపాయలు కేటాయించారు. కానీ ఎప్పుడు చూసినా ఆ పార్కుకు తాళం దర్శనమిస్తుంటుంది. అసలు అధికారులు పార్కును తెరుస్తారా ? తెరవరా ? అనే సందేహాలు వెల్లువెత్తాయి. పార్కును పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు.
2013లో ప్రారంభం..
ఈ ఉద్యానవనాన్ని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 2013లో సుమారు 5కోట్ల వ్యయంతో అప్పటి మంత్రులు సుదర్శన్‌రెడ్డి రెడ్డి, ముఖేశ్‌గౌడ్‌లు ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే వారు ఎంత ఆర్భాటంగా ప్రారంభించారో అంతే వేగంగా మూతపడింది. పర్యాటకులు ఎప్పుడొచ్చినా ఈ పార్కుకు తాళం వేసే ఉంటోంది.
ప్రాజెక్టు పూర్తై 50ఏళ్లు..అభివృద్ధి మాత్ర శూన్యం..
ఈ ప్రాజెక్టు 50ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ అభివృద్ధి మాత్రం పూర్తిగా శూన్యమైంది. ఈ పార్కులో వివిధ రకాలైన మొక్కలను పెంచటంతో పాటు హైమాస్టు లైట్లు ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. కాని ఇవి పనిచేయడం లేదు. పార్కు అభివృద్ధికి మంజూరైన నిధుల్లో కాంట్రక్టర్లు, అధికారులు కుమ్మక్కై తమ జేబులు నింపుకున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు ఇప్పటికైనా ఈ పార్కును అన్నివిధాలా తీర్చిదిద్దాలని పర్యాటకులు కోరుతున్నారు.