ఆ ఫోను చేసిందెవరు..?నీలిమ మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ

హైదరాబాద్‌,ఆగస్టు 3 : నీలిమ మృతికి అయిదు నిమిషాల ముందు వచ్చిన కాల్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్‌ఎంఎస్‌ల డేటాపై కూడా దృష్టి పెట్టారు. అదేవిధంగా శుక్రవారం మధ్యాహ్నం అందనున్న పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా నీలిమ మృతి మిస్టరీ కొనసాగుతోంది.. అనేక ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు రాత్రి 9గంటల నుంచి 10.30 గంటల మధ్య ఏం జరిగిందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేగాక నీలిమ కుటుంబీకులకు తెల్లవారుజామున 3గంటలకు సమాచారం అందించడంపై చర్చ కొనసాగుతోంది. ఎన్నో అంతస్తులో నుంచి ఆమె పడిందన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడో అంతస్తులో ఒక చెప్పు.. 10వ అంతస్తులో ఆమె బ్యాగు.. ఆమెది ఆత్మహత్య కాదని గురువారంనాడు వైద్యులు చెప్పడం తెలిసిందే. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడేటంతటి పిరికిది కాదని తల్లిదండ్రులు తొలిరోజు నుంచి తెగేసి చెబుతున్న విషయం తెలిసిందే.
గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో నీలిమ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నప్పటికీ మిస్టరీ కొనసాగుతునే ఉంది. నీలిమ భవనంపై నుంచి కిందకు పడగానే తొలుత గమించిన సెక్యూరిటీ గార్డు రమేష్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఎవరో బలవంతంగా భవనంపై కిందకు తోసేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో వాస్తవాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు. గురువారం నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ కాల్‌ లిస్టును సేకరించామని చెప్పారు. నీలిమ మృతికి ముందు ఎవరెవరితో మాట్లాడిందనే విషయాలపై ఆరా తీశామని చెప్పారు. నీలిమ కేసులో తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో పోస్టుమార్టం వివరాలు బయటకు వచ్చాకే అన్నీ వెల్లడిస్తామన్నారు. సెక్యూరిటీ గార్డు వాంగ్మూలాన్ని రికార్డు చేశామని చెప్పారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని సంస్థ చెబుతుండగా, ఎవరో చంపేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.