ఆ ముగ్గురిలో..ఎవరైనా ఓకే!
సిఎం మమత, ఎస్పి అధినేత ములాయం
న్యూఢిల్లీ, జూన్ 13 : రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ చెప్పారు. బుధవారంనాడు వారిరువురు వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మమతాబెనర్జీ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె ములా యంసింగ్తో భేటీ అయ్యారు. అనంతరం ములాయంసింగ్, మమతాబెనర్జీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థులను తిరస్కరించామన్నారు. తాము ముగ్గురి పేర్లను ప్రతిపాదించామన్నారు. వారిలో ఏ ఒక్కరికైనా మద్దతు ఇస్తామని ప్రకటించామన్నారు. అబ్దుల్‌కలాం, మన్మోహన్సింగ్, సోమనాధ్ఛటర్జీ పేర్లను ప్రతిపాదించామని, వారిలో ఒకర్ని బలపర్చాలని మిగిలిన పార్టీల ప్రతినిధులను కోరనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా యుపిఎ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్ధికే మద్దతు ఇవ్వనున్నట్టు డిఎంకె తెలిపినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్ధిగా తన పేరు ప్రతిపాదించడంపై సోమనాధ్ఛటర్జి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది.