ఆ రెండు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు

మార్పుతప్పదంటున్న ఓదేలు

టిక్కట్‌ రాకున్నా పోటీకి రాథోడ్‌ సిద్దం

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌లో అసమ్మతి పెరుగుతోంది. చెన్నూరు, ఖానాపూర్‌లపై అసంతృపి బలంగా వినిపిస్తోంది. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని, పార్టీ తనకే టిక్కెట్టు ఇవ్వాలని నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. ఇకపోతే ఖానాపూర్‌లో ఆశలు పెట్టుకుని టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన రాథోడ్‌ కూడా గట్టిగానే ముందుకు పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓదన్ననే గెలుస్తారని, మన ఎమ్మెల్యే ఆయనే అని కార్యకర్తలు నినదించారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత మొదటిసారిగా మందమర్రికి వచ్చిన ఆయన తన నివాసంలో మాట్లాడుతూ తెరాస ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ ప్రతి పిలుపును తాను గౌరవించానని, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని అన్నారు. ఆనాడు 2009 ఎన్నికల్లో కేసీఆర్‌ తన శ్రమను గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన సమయంలో తన వద్ద నామినేషన్‌ వేయడానికి కూడా డబ్బులు లేవని, కేసీఆర్‌ నిధులిచ్చి ఎన్నికల్లో పోటీ చేయించారని తెలిపారు. తనకు అన్నం పెట్టిన దేవుడని పేర్కొన్నారు. 2010లో కేసీఆర్‌ తనను రాజీనామా చేయమని అడిగిన వెంటనే విూకోసం బావిలో దూకమన్నా దూకుతానని చెప్పి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. తర్వాత రెండుసార్లు కూడా తనకు పార్టీ టిక్కెట్టుతో పాటు నిధులు ఇచ్చి గెలిపించారని అన్నారు. కేసీఆర్‌ పట్ల తనకు అపార నమ్మకం ఉందని తిరిగి తనకే టిక్కెట్టు ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి రావాలని ఆయన సీఎం అయితేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని తెలిపారు. అభ్యర్థుల జాబితాలో పేరు లేనప్పటి నుంచి నిమోజకవర్గమంతా తనకు అండగా ఉందని, ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానని ఈ నియోజకవర్గం, ఈ ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లనని ఆయన అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్టు పొందిన ఎంపీ బాల్కసుమన్‌తో కలిసి పనిచేస్తానని తాను అనలేదని ఓదెలు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న తన వద్దకు సుమన్‌ వచ్చి కేసీఆర్‌ తనకు చెన్నూరు టిక్కెట్టు ఇచ్చారని గెలుపునకు కలిసి పనిచేయాలని కోరినట్లు తెలిపారు. తాను మాత్రం నియోజకవర్గంలో స్థానికేతరుడు, స్థానికుడు అనేది ఉందని నీకు ఇబ్బంది అవుతుందని సుమన్‌కు స్పష్టం చేశానని చెప్పారు. కేసీఆర్‌ తనకే టికెట్టు ఇస్తారని సుమన్‌కు చెప్పినట్లు తెలిపారు. తాను రెండు రోజుల్లో కేసీఆర్‌ను కలుస్తానని కచ్చితంగా టిక్కెట్టు తెచ్చుకుంటానని ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానని పేర్కొన్నారు. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో లంబాడీ-ఆదివాసీల మధ్య జోడేఘాట్‌, బేతల్‌గూడ, హస్నాపూర్‌లలో జరిగిన అల్లర్లకు అసలైన సూత్రధారి, పాత్రధారి రాఠోడ్‌డేనని ఆదివాసీలు ఆరోపించారు. ఆదివాసీ ద్రోహి అయిన ఆయనకు ఏ పార్టీ టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలను విమర్శిస్తే ఊరుకునేది లేదని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలలో గణనీయమైన ఆదివాసీ ఓటర్లు ఉన్నా అవేవిూ పట్టించుకోకుండా తెరాస రెండు చోట్ల లంబాడీలకు చెందిన అభ్యర్థులకు టికెట్‌ ఖరారు చేసి ద్రోహం చేస్తోందని విమర్శించారు. కర్ణాటక నుంచి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌, బోథ్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావులకు సైతం ఓటమి తప్పదన్నారు.