ఆ స్వరం రేవంత్‌దే

1

హైదరాబాద్‌,నవంబర్‌27(జనంసాక్షి):

కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈకేసులో కీలక ఆధారమైన నిందితుల స్వర నమూనాల విశ్లేషణ పూర్తయింది. వీడియో, ఫోన్‌ రికార్డుల్లో ఉన్న గొంతు టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలదేనని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిర్ధారించింది. శాసనసభ్యులతో పాటు మత్తయ్య, స్టెబాస్టియన్‌ల స్వర నమూనాలను కూడా ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీ ధ్రువీకరించింది. విశ్లేషణల నివేదికను ఫోరెన్సిక్‌ నిపుణులు ఏసీబీ న్యాయస్థానానికి అప్పగించారు. దీంతో ఈ కేసు విషయంలో మళ్లీ ముందుకు సాగే వీలుంది. కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలను ఒక్క కుదుపు కుదిపేసిన ఓటుకు నోటు కేసు వ్యవహారం కీలక దశకు చేరింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ కు రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం విదితమే. అయితే ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ కు సంబంధించిన వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియోల్లోని స్వరం రేవంత్‌ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జెరూసలేం ముత్తయ్య స్వరంతో సరిపోలినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిర్ధారించింది. ఇక ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కోర్టుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు సమర్పించారు. స్వర నిర్ధారణకు సంబంధించిన నివేదికను తమకు కూడా ఇవ్వాలని ఏసీబీ కోరనుంది. అయితే స్టీఫెన్‌ సన్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు కూడా మాట్లాడినట్లు ఆడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు స్వర నమూనాను సేకరించాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం.