ఇంచార్జీ జడ్పీ చైర్మన్ గా బాలాజీ సింగ్.

టిఆర్ఎస్ తోనే ఉద్యమకారులకు గౌరవం.
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్28 (జనంసాక్షి):

జిల్లా పరిషత్ ఇంచార్జీ చైర్మన్ గా చారగొండ మండల జడ్పిటిసి,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్  బాలాజీ సింగ్ సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.జిల్లా అదనపు కలెక్టర్ మనూ చౌదరి నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ బాలాజీ సింగ్ కు జడ్పీ చైర్మన్ ఇంచార్జీ బాధ్యతలు లభించినందు కు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల అదృష్టం గా భావిస్తున్నామని ఈ సందర్భంగా బాలాజీ సింగ్ కు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.ఉన్నత విద్యావంతుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట 2010 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉత్తమ నాయకుడిగా ఎదిగారని అన్నారు.ఉద్యమ నాయకుడికి సరైన గుర్తింపు వచ్చినట్లు అయిందని కొనియాడారు.కెసిఆర్ నాయకత్వంలో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రంలో కూడా నాగర్ కర్నూల్ జిల్లాను బాలాజీ అధ్యక్షతన ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందువల్ల రాష్ట్రంలో భూములకు విలువలు పెరిగాయని అదే విధంగా వలసలు తగ్గాయని తెలిపారు.బాలాజీ సింగ్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నాగర్ కర్నూల్ జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.అనంతరం ఇంచార్జీ జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ అనివార్య కారణాలవల్ల కోర్టు తీర్పుతో  జడ్పీ చైర్పర్సన్ ను తొలగించడం వల్ల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో ఇంచార్జీ బాధ్యతలు చేపట్టవలసి వచ్చిందని అన్నారు.జడ్పిటిసిల సమన్వయంతో జిల్లాను విద్య వైద్య రంగాలలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటట్లు కృషి చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఇంచార్జీ జడ్పీ చైర్ పర్సన్ ను జాయింట్ కలెక్టర్ మనూ చౌదరి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పూల బొకేలు, శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జడ్పిటిసి చిక్కొండ్ర శ్రీశైలం,జిల్లా పరిషత్ సీఈవో ఉష తదితరులు పాల్గొన్నారు.