ఇంటర్ సిలబస్‌లో 30శాతం తగ్గింపు
` ఇంటర్ ప్రవేశాల గడువు మరోమారు పెంపు
హైదరాబాద్,నవంబరు 22(జనంసాక్షి):తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా 70 శాతం సిలబస్‌ను మాత్రమే బోధించనున్నారు.కరోనా నేపథ్యంలో తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 70 శాతం సిలబస్‌తోనే విద్యా సంవత్సరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక 70 శాతం సిలబస్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది కూడా విద్యా సంవత్సరాన్ని 70 శాతం సిలబస్‌తోనే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపోతే తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు మరోసారి పొడిగించారు. ఇంటర్ ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడిరచింది. గడువు పొడిగింపు ఇదే చివరిసారని స్పష్టం చేసింది. ఆయా కాలేజీలు, యూనియన్ల విజ్ఞప్తుల మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొన్నది.