*ఇంటర్ లోఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు…*
ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. మంగళవారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన సోఫినగర్ గురుకుల విద్యార్థిని పుట్టి ధనుష్కను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభను కనబర్చడం సంతోషంగా ఉందని అన్నారు.
మరోవైపు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో ప్రథమ సంవత్సరంలో మూడో స్థానంలో నిలవడం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటిన విద్యార్థులను, ఉత్తమ విద్యార్థులకు తీర్చిదిద్దేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయులను, సిబ్బందిని, ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్ధులు కృషితో, పట్టుదలతో ఉన్నతమైన విజయాలను సాధిస్తూ కన్న తల్లిదండ్రులకు, పుట్టి పెరిగిన గ్రామాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ను అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లాగా పిలిచేవారని… తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో దూసుకుపోతుందని ముఖ్యంగా విద్యా రంగంలో ఈ ప్రాంత విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. ఇంటర్ విద్యా వ్యవస్థపై ముఖ్య మంత్రి కేసి ఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకోడం వల్లే ఈసారి గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని పేర్కోన్నారు.