ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్
– రూ.1,212 కే విమాన ప్రయాణం
ముంబయి, జులై10(జనంసాక్షి) : దేశంలో తక్కువ ధరలకే విమాన సేవలు అందించే సంస్థల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఒకటి. ఈ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది. ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై 25నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే ప్రయాణాలకుగాను మంగళవారం నుంచి జులై 13వ తేదీ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. దాదాపు 57 ప్రధాన నగరాలను కలుపుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇండిగో అందిస్తున్న సేవలన్నిటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. సంస్థ అధికార ప్రతినిధి విలియమ్ బౌల్టర్ మాట్లాడుతూ ‘ఇండిగో ఎయిర్‌లైన్స్ స్ధాపించి 2018 ఆగస్టు 4కి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నామన్నారు. ప్రారంభ ధర రూ.1,212 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని, మొత్తం 12 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇండిగో సేవలందిస్తున్న అన్ని మార్గాల్లో ప్రయాణించేవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చ’ని తెలిపారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో బుకింగ్ చేసుకునేవారు క్యాష్‌బాక్ కూడా పొందవచ్చని ప్రకటించింది. దీనికి కనీసం రూ.3000తో బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.