ఇందిరా, ఎన్టీఆర్‌ కాలిగోటికి కూడా.. కేసీఆర్‌ సరిపోడు


– టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే
– పవన్‌ కళ్యాణ్‌ తటస్థంగా ఉండాలి
– కాంగ్రెస్‌ నేత వి.హెచ్‌. హన్మంతరావు
హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌ల కాలి గోటికి కూడా కేసీఆర్‌ చాలడని కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ హనుమంత రావు అన్నారు. సోమవారం  ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుతున్నారని అన్నారు. ఇందిరా గాంధీ, రామారావుల కాలి గోటికి కూడా కేసీఆర్‌ చాలడని, వాళ్ళతో కేసీఆర్‌ ని పోల్చుకోవటమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లివర్‌ ఫెయిల్‌ అయింది అని విూమెందుకు చెప్తం.. అట్లచెప్పి నువ్వు విూ నాయనని కించపరుస్తున్నావు కేటీఆర్‌ అని హనుమంతరావు అన్నారు. 23సీట్లలో పోటీచేసే విషయంపై ఆలోచన చేయాలని పవన్‌ కళ్యాణ్‌ భావించడం పై వి.హెచ్‌ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ న్యూట్రల్‌ గా ఉండు.. మాబతుకు మేం బతుకుతం..  కేసీఆర్‌ కి లాభం చేసేలా చేయొద్దు అని పవన్‌ ని కోరారు. వెంకట స్వామి కుటుంబంకు పార్టీలో అన్ని పదవులు వచ్చాయని, ఇప్పుడు వినోద్‌ మళ్లీ పార్టీలోకి వస్తారట.. ఇదిమంచి పద్ధతి కాదన్నారు. ఎవడి ఇష్టం వచ్చినప్పుడు ఉంటడు.. లేకపోతే పోతాడా అని హనుమంత రావు మండిపడ్డారు. ఇప్పుడు చెన్నూరులో పార్టీ బలంగానే ఉందని, రాహుల్‌ గాంధీకి కూడా ఈవిషయం చెప్తానని ఆయన తెలిపారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి గందరగోళం లేదని, దసరా నాటికి సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వస్తుందన్నారు. నాలుగేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏవిూ లేదని విమర్శించారు. కేవలం కేసీఆర్‌, కేటీఆర్‌లు ప్రజలకు హావిూలు ఇవ్వటం తప్ప వాటిని పరిష్కరించిన దాఖలాలు కనిపించలేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పేదలందరికీ ఇస్తామని చెప్పారని, కానీ కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇచ్చుకొని డబుల్‌ బెడ్‌రూంలు ఇచ్చామని డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదల సమస్యలుపరిష్కారం అవుతాయని, ఆమేరకు ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని అన్నారు. ప్రతి పార్లమెంట్‌ స్థానంలో రెండు స్థానాలు బీసీలకు కేటాయించాలని ఈ సందర్భంగా వి.హెచ్‌. సూచించారు.