ఇకపై పాఠ్య పుస్తకాలలో ‘ఇండియా’ కనుమరుగు

` ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు
న్యూఢల్లీి(జనంసాక్షి):పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్‌ అని వాడాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నియమించిన ఉన్న తస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ‘అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో భారత్‌ పేరును వినియోగిం చాలని ఏకగ్రీవంగా తీర్మానించాం. దీంతో పాటు.. ప్రాచీన చరిత్రను ‘క్లాసిక్‌ హిస్టరీ’ పేరుతో విద్యా ర్థులకు బోధించాలని సిఫార్సు చేశాం‘ అని కమిటీ ఛైర్మన్‌ ఇసాక్‌ పేర్కొన్నారు. ‘భారత్‌ పేరు.. పురాతనమైంది. ఏడువేల సంవత్సరాల క్రితం విష్ణుపురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో ’భారత్‌’ ప్రస్తావన ఉంది‘ అని చెప్పారు. అయితే ఈ  సిఫార్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్‌ దినేశ్‌ ప్రసాద్‌ సకలాని తెలిపారు. ఇటీవల జీ20 సమావేశాల సందర్భంగా ఆహ్వాన పత్రాల్లో ’ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. సదస్సులో మోడీ నామఫలకంలోనూ ఇండియా స్థానంలో భారత్‌ అని ఉంది. ªూఠ్యపుస్తకాల్లో హిందూ విజయాలకు ప్రముఖ స్థానం ఇవ్వాలని తమ కమిటీ పేర్కొందని ఇసాక్‌ తెలిపారు. ‘పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా మన వైఫల్యాలనే ప్రస్తావించారు. మొగలులు, సుల్తానులపై మన విజయాలను పొందుపరచలేదు. చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించి భారత్‌ చీకట్లో ఉన్నట్లు బ్రిటిషర్లు చూపించారు. దేశ శాస్త్ర విజ్ఞానాన్ని, ప్రగతిని విస్మరించారు. అందుకే మధ్య, ఆధునిక యుగాలతో పాటు.. భారత్‌ చరిత్రలో సంప్రదాయ  యుగాన్ని కూడా విద్యార్థులకు నేర్పాలని సూచించాం‘ అని ఇసాక్‌ చెప్పారు. భారత చరిత్ర పరిశోధన మండలి(ఐసీహెచ్‌ఆర్‌)లోనూ ఇసాక్‌ సభ్యుడిగా ఉన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సిఫార్సులను విపక్ష ‘ఇండియా’ కూటమి వ్యతిరేకించింది. చరిత్రను భాజపా తిరగరాయాలని అను కుంటోందని అందుకే.. ఇలాంటి చర్యలు పాల్పడుతోందని విమర్శించింది.