ఇక చకచకా మిషన్ భగీరథ పనులు
పెండింగ్ పనుల పూర్తికి అధికారుల కసరత్తు
ఆదిలాబాద్,డిసెంబర్12(జనంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇక పనులు సత్వరం పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ముందుకు సాగేలా ప్రణాళిక చేస్తున్నారు. ప్రభుత్వం ఉమ్మడి మండలాలకు 120 ట్యాంకులు మంజూరు చేసింది. వాటి నిర్మాణ కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ట్యాంకు నిర్మాణం పనులు చకచకా చేపడుతున్నారు. నిర్మాణ పర్యవేక్షణను ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించడంతో గడువులోగా పనులు పూర్తి చేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. జనాభా లెక్కల ప్రకారం 60, 40, 20, 10 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. పలు గ్రామాల్లో వివిధ దశల్లో ట్యాంకుల నిర్మాణ పనులు కొసాగుతున్నాయి. తాగునీటి ట్యాంకులు నిర్మించి సమస్యను శాశ్వతంగా అరికట్టి త్వరగా స్వచ్ఛమైన జలం అందనుందని చెబుతున్నారు.