ఇక టిఆర్‌ఎస్‌ది ఒంటరి పోరాటం: వినయ్‌

వరంగల్‌,నవంబర్‌21: వచ్చే  ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌  స్పష్టం చేశారు. సూర్యాపేట సమర భేరి సభతో మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని వరంగల్‌లో పునరుద్ఘాటించారు. ఇకపై చర్చలు ఉండవని.. మానుకోట తరహా పోరాటాలకు రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. ఎన్ని అవాంతరాలెదురైనా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని, కేసులకు జడిసేది లేదని పేర్కొన్నారు. టిడిపి అధినేత వందసార్లు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కంటే.. ఒకసారి తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తే చాలని అన్నారు. నీలం తుపాను నష్టం అంచనాల్లోనూ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు.సకల జనుల సమ్మె సందర్భంగా రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మేరకు రైల్వే రక్షక దళాలు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డితో సహా 21 మందిపై గతంలో కేసు నమోదుచేశాయి. ఆ కేసు విచారణలో భాగంగా  కాజీపేట రైల్వే కోర్టుకు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ హాజరయ్యారు. శాంతియుత మార్గంలో తెలంగాణ ఉద్యమం చేస్తున్నా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.  ఎందరో విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాగుతుండగా పాలకులు మాత్రం అణిచివేసే ధోరణిలో అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడటం సరికాదన్నారు. వెంటనే అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసు విచారణ జనవరికి వాయిదా పడిందని తెరాస నేతలు తెలిపారు.