ఇక తెలంగాణ మహోద్యమం

అసెంబ్లీ ముట్టడి .. హైదరాబాద్‌ దిగ్బంధం
జాతీయ నేతలకున్న సోయి టీకాంగ్రెస్‌ నేతలకు లేదు
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమాన్ని మహోద్యమం చేసే దిశలో తెలంగాణ జేఏసీ కసరత్తు చేస్తోందని, ఇందులో భాగంగా ఆదివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీలకు చెందిన జాతీయ నేతలు శరద్‌పవార్‌, అజిత్‌సింగ్‌, మాయావతి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ నేతలకు ఉన్న సోయి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఎండగడుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నటు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఉద్యమకార్యాచరణకు విస్తృతస్తాయి సమావేశంలో తుదిరూపం ఇస్తామని అన్నారు.
అసెంబ్లీ ముట్టడి, హైదరాబాద్‌ దిగ్బంధనం వంటి కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ కోసం చేపట్టే ప్రతి ఉద్యమం కాంగ్రెస్‌ నేతలపైనే ఉంటుందని అన్నారు. ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చకముందే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోలేక యూపీిఏ భాగస్వామ్య పక్షాలపై ఇంతకాలం కాంగ్రెస్‌ అధిష్టానం నేపం వేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా యూపీఏకు బయటనుంచి మద్దతు ఇస్తున్న మయావతి, మంత్రివర్గంలో భాగస్వాములు శరద్‌ పవార్‌, అజిత్‌సింగ్‌ సమ్మతించిన తరువాత కూడా కేంద్రం ఎందుకు నాన్చుతున్నదని ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు చేసిన రాజీనామాలు నామమాత్రమేనని ఆరోపించారు. తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం దిగిపోతుందని అందుకే కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందని కోదండరామ్‌ అన్నారు. భవిష్యత్తులో తాము చేపట్టబోయే ప్రతి ఉద్యమం తీవ్ర రూపంలో ఉంటుందని హెచ్చరించారు. మాజీమంత్రి శంకరావును పోలీసులు అరెస్టు చేయడం సమంజసం కాదని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందుకు శంకర్‌రావు అరెస్టు ఉదంతమే నిదర్శనమని అన్నారు. దళిత నేత అని చూడకుండా పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు.