ఇక నాలుగో విడుత హరితహారంపై అధికారుల దృష్టి 

జిల్లాలోని 98నర్సరీల్లో 1.52కోట్ల మొక్కల పెంపకం
శాఖలవారీగా మొక్కల పెంపకంపై లక్ష్య నిర్దేశం
సూర్యాపేట,మే19( జ‌నం సాక్షి): రైతుబంధు కార్యక్రమం ముగియడంతో ఇక వచ్చే నెలలో హరితహారం నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఈ యేడు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. నాలుగో విడుత హరితహారం జూన్‌లో ప్రారంభం కానుండగా ఆయా నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను దాదాపు అన్నిశాఖలు పాల్గొని నాటాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1.43కోట్ల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. నర్సరీల్లో టేకు, వేప, కానుగ, నల్లమద్ది, తెల్లమద్ది, చింత, మోదుగు, బూరుపత్తి, శిశు, బొప్పడి, మునగ, దాని మ్మ, జామ, జీడిపప్పు, సీతాఫలం, సీమచింత, కాగితం పూలు, రేళా, నిమ్మ, కరివేపాకు, గుల్మోరు, మందారం, మర్రి, గోరింటాకు, గన్నేరు, పచ్చగన్నేరు, దిర్శిన, ఈత తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి.గత సంవత్సరం మాదిరే ఈసారీ అన్నిశాఖలను హరితహారంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించడంతో ఆయాశాఖలకు ఇప్పటికే టార్గెట్‌ నిర్నయించారు. ఆ మేరకు వివిధ శాఖల ద్వారా నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. అత్యధికంగా అటవీశాఖ 73.90లక్షల మొక్కలు పెంచుతుండగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 30లక్షల టేకుమొక్కలు, హార్టికల్చర్‌ నేతృత్వంలో 10లక్షల పండ్ల మొక్కలు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 3లక్షలు, ఐటీసీ కంపెనీ ఆధ్వర్యంలో 18లక్షలు, సిమెంట్‌ కంపెనీల ఆధ్వర్యంలో 8లక్షల మొక్కల పెంపకం జరుగుతున్నది.  సకాలంలో వర్షాలు పడకపోవడం..కరువు అలుముకోవడంతోపాటు కాసేపు సేదతీరేందుకు నీడ సైతం దొరకని పరిస్థితి ఉండేది. ఇందులో భాగంగా అడవులను పెంచాలనే లక్ష్యంతో హరితహారం ప్రారంభించి ఇప్పటికే మూడు విడుతలు పూర్తిచేశారు. అప్పడు నాటిన మొక్కలు పెరిగి పెద్దవుతున్నాయి.
జిల్లా యంత్రాంగం నిర్దేశిరచిన లక్ష్యాల్లో అత్యధికంగా జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 65లక్షల మొక్కలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 15లక్షల మొక్కలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో 1.50లక్షలు, ఎక్సైజ్‌శాఖ 7లక్షలు, వైద్య ఆరోగ్యశాఖ 25వేల మొక్కలు, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 3లక్షల మొక్కలు, రోడ్లు భవనాల శాఖ 40వేల మొక్కలు, పంచాయతీరాజ్‌శాఖ 50వేల మొక్కలు, నీటి పారుదలశాఖ 3.5లక్షల మొక్కలు, వ్యవసాయశాఖ 12లక్షల మొక్కలు, మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ 9.69లక్షలు, పరిశ్రమలశాఖ 9లక్షలు, ఉద్యానవనశాఖ 10లక్షలు, దేవాదాయశాఖ 25వేలు, సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో 25వేల చొప్పున, పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 25వేలు, మార్కెటింగ్‌శాఖ ఆధ్వ్యంలో 25 వేలు, ఆర్టీసీ ఆధ్వర్యంలో 41వేల మొ క్కలు నాటాలని నిర్ణయించారు. జిల్లాలోని 23మండలాల్లో ఏయే మండలాల్లో ఎన్ని నాటాలనే లక్ష్యాన్ని సంబంధిత అధికారులు రూపొందించుకున్నారు.

తాజావార్తలు