ఇది ముమ్మాటికీి కక్ష సాధింపే!
– ఏఐసీస ఉపాధ్యక్షుడు రాహుల్
న్యూఢిల్లీ,డిసెంబర్9(జనంసాక్షి): నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం వంద శాతం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచే కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్లమెంట్ వెలుపల రాహుల్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు నుంచి పార్లమెంట్‌కు చేరడంతో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. న్యాయ వ్యవస్థను ఎవరు అదుపులోకి తీసుకున్నారో అందరికీ తెలుసని రాహుల్ విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తాము నిర్దోషులమని రుజువు చేసుకోవాలంటే కాంగ్రెస్ ఆధారాలతో రావాలని రూఢీ అన్నారు. ఆధారాలతో వస్తే సభలో చర్చిస్తామన్నారు. హెరాల్డ్ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడే ధైర్యం రాహుల్‌కు లేదన్నారు.