ఇది సూటు బూటు సర్కార్‌

2

-రైతు కూలీల బాధలు పట్టవు

-కార్పోరేట్‌ల సేవకే పరిమితమయ్యారు

-లోక్‌సభలో రాహుల్‌ ఘాటు విమర్శ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి): ‘విూది సూటు బూటు వేసుకున్న పెద్దమనుషుల ప్రభుత్వం. రైతులు, కూలీల బాధలు విూకు పట్టవు అంటూ విమర్శించారు. కార్పొరేట్ల సేవకే పరిమితమయ్యారని , రెండో సారి ప్రవేశపెట్టిన భూ సేకరరణ సవరణ బిల్లుపై సోమవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ.. ఎన్డీఏ ప్రభుత్వం పై తీవ్రంగా ధ్వజమెత్తారు.  రైతుల బతుకులతో  ఆటలాడుకోవద్దని మోడీ సర్కారును హెచ్చరించారు. 55 రోజుల సెలవుల తరువాత మొదటిసారి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ఆయన.. తన వాక్పటిమతో ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.  కొందరు పెద్దల కోసం రైతులను బలి చేయవద్దంటూ మాటలు ఎక్కుపెట్టారు.  దేశంలో 70 శాతం మంది రైతులు, కూలీలే. వాళ్లను విస్మరిస్తే ఫలితం అనుభవించక తప్పదు’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. రైతుకు సమస్య వస్తే ప్రభుత్వం కానీ, దేవుడు కానీ ఆదుకోలేరన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆయన మనసులోని మాటనే బయటపెట్టారని ఎద్దేవాచేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గోధుమలపై మద్దతు ధర రూ. 10 మాత్రమే పెంచిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది యూపీఏ ప్రభుత్వమేనన్నారు. రైతులు ఆనందంగా ఉంటేనే దేశానికి శ్రేయస్కరమన్న ఆయన దేశం వెలిగిపోతోంది అంటూ ప్రచారం చేసుకున్న ప్రభుత్వం హయాంలో వ్యవసాయ వృద్ధిరేటు 2.6 శాతమేనన్నారు. యూపీఏ హయాంలో వ్యవసాయ వృద్ధిరేటు 4.2 శాతం ఉందన్నారు.  భూసేకరణ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. బిల్లును వ్యతిరేకిస్తూ దాదాపు అరగంటసేపు మాట్లాడిన ఆయన మధ్యమధ్యలో చలోక్తులు విసురుతూ సభలో నవ్వులు పూయించారు. అధికార పార్టీ ఎంపీలను ఉద్దేశించి.. ‘విూ ప్రధాని (ఆప్‌ కీ ప్రధాన్‌ మంత్రి)  రైతులకు అన్యాయం చేస్తున్నారు.. అలా చెయ్యొద్దని విూ ప్రధానికిదే నా మనవి’ అన్నారు. దీనికి అభ్యతరం తెలిపిన అధికార పార్టీ ఎంపీలు.. ‘విూ ప్రధాని అంటారేంటి? మోదీ దేశానికే ప్రధాని’ అని బిగ్గరగా అరిచారు. రాహుల్‌ గాంధీ వారికి బదులిస్తూ .. ‘అదేంటి? ఆయన విూకు ప్రధాని కాదా..! దేశానికి ప్రధాని అయినంత మాత్రన విూకు ప్రధాని కాకుండాపోతారా! ఆ విధంగా చూస్తే నేను మాట్లాడింది కరెక్టే’ అని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. దీనిపై అధికార పక్ష సభ్యులు

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.  అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఈ విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. మద్దతు ధర లభించక బాధపడుతున్న రైతుల వద్దకు ప్రధాన మంత్రి ఎందుకు వెళ్లరని రాహుల్‌ ప్రశ్నించారు. మార్కెట్‌లో కుప్పలుగా పేరుకుపోతున్న ధాన్యం రాశులను ప్రధాని ఎందుకు పరిశీలించరని ఆయన అడిగారు. ఇది కార్పొరేట్ల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. ‘విూ ప్రధాని’ అని రాహుల్‌ పేర్కొనడాన్ని అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు దేశప్రధాని అని రాహుల్‌ సవరించుకున్నారు. మోడీ అరవై ఏడు కోట్ల మంది రైతుల గురించి మాట్లాడకుండా కార్పొరేట్ల గురించే మాట్లాడుతున్నారని అన్నారు. తుపాకులు, యుద్ద విమానాల గురించే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.అత్యధికుల వైపు మోడీ ఉంటారా?లేక కొద్ది సంఖ్యలో ఉండే కార్పొరేట్ల వైపు ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.ప్రఖ్యాత శాస్త్రవేత్త స్వామినాధన్‌ చేసిన ఒక వ్యాఖ్యను వినిపిస్తూ భవిష్యత్తు దాన్యం పండించే దేశాలది కాని,తుపాకులు తయారు చేసేది కాదని రాహుల్‌ గాందీ అన్నారు.విదేశీయాత్ర చేసే ప్రధాని రైతులను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని

అన్నారు.

ఈ చర్చ అత్యంత ప్రాధాన్యం కలిగిందని, అందరూ సహకరించాలని మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అందరికీ మాట్లాడే అవకాశం ఉందని, సావకాశంగా చర్చిద్దామని ఆయన అన్నారు. రైతుల బాధలు, ఆవేదన విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని, దేశంలో అన్ని వ్యవస్థలు వ్యవసాయం, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెంకయ్యనాయుడు అన్నారు.