ఇదేం పారిశుద్ధ్యం?

5

– వెంగళ్రావు పార్కును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌

– అపరిశుభ్రతపై మంత్రి మండిపాటు

హైదరాబాద్‌,జులై 23(జనంసాక్షి): హైదరాబాద్‌లో మౌళిక వసతులతో పాటు పార్కులను కాపాడుకోవాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అతికొద్దిగా ఉన్న పార్కులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఇందుకుప్రజల భాగస్వామ్యం కూడా కావాలన్నారు. శనివారం మంత్రి  హైదరాబాద్‌లో ఆకస్మిక తనిఖీలు కొనసాగించారు.  ఉదయం బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్క్‌ను స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని సమస్యలను వాకర్స్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్కును పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దానిని సరిగా మెయింటెన్‌ చేయాల్సి ఉందన్నారు.  వెంగళ్‌రావు పార్క్‌ను దత్తత తీసుకోవాలని కోరి దాన కిషోర్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు. నగరంలో ఈతితక్కువగా ఉన్న పార్కులను ఆహ్లాదంగా ఉంచుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో హరితహారం పేరిట చెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. హరితహారంలో భాగంగా 20 రోజుల్లోనే 15 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు సంరంక్షించాలని సీఎం పదే పదే చెబుతున్నారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, అధికారులు మంత్రి వెంట ఉన్నారు. తాను కూడా ఓ పార్క్‌ను దత్తత తీసుకోనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలోని వాకర్స్‌ పంపిన వాట్సాప్‌ మెస్సేజ్‌కు స్పందించి మంత్రి పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో గల సమస్యలను వాకర్స్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్క్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న పార్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని పార్కులన్నింటినీ ఆహ్లాదకరంగా మారుస్తమని తెలిపిన ఆయన పార్కుల్లో పిల్లలకు ఆటల పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని పార్క్‌లను ప్రజాప్రతినిధులు, అధికారులు దత్తత తీసుకోవాలని సూచించారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను సైతం వారికే అప్పగిస్తామన్నారు. పర్యవేక్షణలో భాగంగా ఎప్పటికప్పుడు వాకర్స్‌ అసోసియేషన్‌తో అధికారులు సమావేశమై సలహాలు తీసుకోవాలన్నారు. హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవుతున్నరని తెలిపిన మంత్రి ఇప్పటివరకు 17 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ఇదిలావుంటే  హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆస్కి ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా బస్‌ షెల్టర్లు, పార్కులు, స్వచ్ఛ హైదరాబాద్‌ వంటి పలు కార్యక్రమాల్లో ఆస్కి భాగస్వామ్యంపై మంత్రి చర్చించారు. పరిష్కారాలతో ఆచరణలోనూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆస్కి మొదటి దశలో నగరంలోని 150 ప్రాంతాల్లో పనులు చేపట్టే అవకాశం ఉంది.