ఇప్పటికీ సమస్యలపై చొరవలో హరీష్‌ రావే ముందు

సిద్దిపేట,మే30(జ‌నంసాక్షి): ప్రభుత్వంలో నేరుగా మంత్రిస్థానంలో లేకున్నా సిఎం తనయుడిగా, పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా ఇప్పటికీ రెండోస్థానంలోనే కెటిఆర్‌ ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు ఆయనదే సింహభాగమని చెప్పక తప్పదు. సమస్యేదైనా ఆయన స్పందిస్తున్న తీరు, ఆయనకే వినతి పత్రాలు వస్తున్న తీరు, పార్టీలోనూ, ప్రభుత్వంలోని ప్రముఖులు ఆయనకు ఇస్తున్న విలువ చూస్తుంటే కాదనలేము. నిజానికి మొన్నటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అసవరం కేంద్రంలో ఉండివుంటే, మోడీకి సీట్లు తక్కువ వచ్చివుంటే ఈ పాటీకి కెటిఆర్‌ సిఎం స్థానంలో ఉండేవారని ఇప్పుడు గులాబీ పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. సిఎం కెసిఆర్‌ పరోక్షంగా కెటిఆర్‌ మాత్రమే నంబర్‌ 2 అన్న సంకేతం ఇచ్చారన్నది బహిరంగ రహస్యం. నిజానికి హరీష్‌రావు ప్రజా సమస్యల పరిస్కరాంలోనూ, చొరవలోనూ ముందంజలో ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి ఆయనే ముందున్నారు. సమస్య ఏదైనా ప్రత్యక్ష మవుతారు. అలాంటిది ఆయన మంత్రివర్గలో లేకపోవడం, పార్టీలో కీలకపదవిలో లేకపోవడం వంటి కారణంగా కేవలం సిద్దిపేటకే పరిమితం అయ్యారు. నిజానికి హరీష్‌ రావు నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలుకుతారు. ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇక అభివృద్ది విషయంలో అయితే ప్రత్యర్ధులు కూడా ఆయనపై విమర్శలు చేయరు. నియోజకవర్గం చూసుకుంటూనే మొన్నటి వరకు పార్టీ..ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి అలాంటి హరీష్‌కు ప్రాధాన్యం తగ్గించారు. కెటిఆర్‌తో పోలిస్తే అందరికీ అందుబాటు విషయంలో హరీష్‌ రావే ముందుంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కళ్ళు మూసుకుని భారీ మెజారిటీతో గెలవగలిగే వారిలో హరీష్‌ రావు ముందుంటారు. మొన్నటి మెదక్‌ ఎంపి ఎన్నికల్లో కూడా కొత్త ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. మరి అలాంటి హరీష్‌ రావు వెనక్కి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా హరీష్‌ స్థానం రెండు కాదని తేల్చడం, తన వారసుడు కెటిఆర్‌ చెప్పడమే కెసిఆర్‌ ఉద్దేశ్యం.