ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

4

– జీఎస్‌ఎల్వీ 05 రాకెట్‌ విజయవంతం

శ్రీహరికోట,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):ఇస్రో మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని దక్కించుకుంది. ఇస్రో చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ వాహకనౌక సాయంత్రం 4.50 గంటలకు నింగి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. వాతావరణ అధ్యయనానికి సంబంధించిన ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్లింది. నిర్దేశించిన 17 నిమిషాల వ్యవధిలో ఇన్‌శాట్‌ 3 డీఆర్‌ ఉపగ్రహాన్ని కక్షల్యోకి ప్రవేశపెట్టింది. ఇన్‌శాట్‌ 3 డీఆర్‌ బరువు 2,211 కిలోలు, దీనిని తయారు చేసేందుకు అయిన వ్యయం రూ.250 కోట్లు. ఇన్‌శాట్‌ 3డీఆర్‌ వాతావరణ శాస్త్ర అధ్యయనంకు ఉపయోగపడనుంది. ఈ ఉప గ్రహం జీవితకాలం పదేళ్లు. ఈ ఉపగ్రహం బరువు 2,211కిలోలు కాగా.. ఇంధనం 1,255కిలోలు. కౌంట్‌డౌన్‌ ప్రకారం రాకెట్‌ ప్రయోగం సాయంత్రం 4.10 గంటలకు జరగాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సాంకేతికలోపం గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని 40 నిమిషాల పాటు వాయిదా వేసి మరమ్మతుల చేపట్టారు. అనంతరం రాకెట్‌ను 4.50 గంటలకు నింగిలోకి ప్రయోగించారు. 2013లో ప్రయోగించిన ఇన్సాట్‌-3డీ శాటిలైట్‌కు కొనసాగింపుగా ఇన్సాట్‌-3డీఆర్‌ను డిజైన్‌ చేశారు. ఇప్పటికే కక్ష్యలో చేరిన కల్పన-1, ఇన్సాట్‌-3ఏ తర్వాత ఇస్రో రూపొందించిన అతిపెద్ద వాతావారణ శాటిలైట్లు ఇవి. గురువారం ఇన్సాట్‌-3డీఆర్‌ను జీటీవోలో ప్రవేశపెట్టేందుకు జీఎస్‌ఎల్వీ-ఎంకే2 ను ఉపయోగిస్తున్నది. ఈ శాటిలైట్‌ బరువు 2211 కిలోలు. ప్రొపెల్లంట్‌ బరువు 1255 కిలోలు. అట్మాస్ఫెరిక్‌ సౌండింగ్‌ సిస్టం ఉండటం ఇన్సాట్‌-3డీఆర్‌కు అదనపు ప్రత్యేకత. రాత్రిపూట మేఘాలకు సంబంధించిన నాణ్యమైన చిత్రాలను తీయడం, సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతను కొలిచే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది. సముద్రంలో చిక్కుకొన్న నౌకల సమాచారాన్ని, ప్రదేశాన్ని తెలిపే సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ట్రాన్స్‌పాండర్లను దీనికి అమర్చారు. ఇన్సాట్‌ 3డీ గడువు కాలం 2021, ఇన్సాట్‌3డీఆర్‌ జీవితకాలం 2024. తదనంతరం ప్రయోగించే ఇన్సాట్‌ 3డీఎస్‌ 2022 నుంచి 2029 వరకు సేవలందించే అవకాశముంది.

క్రయోజెనిక్‌ ఉపయోగం ఇది నాలుగోసారి

2001 ఏప్రిల్‌లో తొలిసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన క్రయోజెనిక్‌ ఎగువ, మూడో, స్టేజ్‌ ఇంజిన్లు ఉన్న జీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ప్రయోగం విఫలమైంది. అప్పటి నుంచి 14 ఏండ్ల కాలంలో ఎనిమిదిసార్లు ఈ రాకెట్‌ ప్రయోగాలను చేపట్టారు. అందులో రష్యా రూపొందించిన క్రయోజెనిక్‌ ఇంజిన్లతో ఐదుసార్లు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్లతో మూడుసార్లు ప్రయోగాలు జరిపారు. ఆ ప్రయోగాలలో మూడు విజయవంతం కాగా, నాలుగు విఫలమయ్యాయి. ఒకటి పాక్షికంగా సఫలమైంది. ప్రస్తుతం అంతరిక్ష వాహక నౌక గమనాన్ని గానీ, ప్రామాణికతను, పరికరాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించడం లేదు. కేవలం పేలోడ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అయితే రాకెట్ల ప్రయోగానికి క్రయోజెనిక్‌ ఇంజిన్లను ఉపయోగించుకోవాలని తొలిసారి 1986లో ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ తర్వాత మూడేండ్లకు సోవియట్‌ యూనియన్‌కు చెందిన గ్లావ్‌కాస్మోస్‌ కంపెనీతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకున్నది. దీనిని రద్దు చేసుకోవాలని అమెరికా ఆదేశించినా.. ఇరు కంపెనీలు నిరాకరించడంతో భారత్‌, రష్యాపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఒప్పందం రద్దుకు రష్యా అధ్యక్షుడు బోరిస్‌ ఎల్సిన్‌ ఒత్తిడి చేయడంతో గ్లావ్‌కాస్మోస్‌ వెనుకడుగు వేసింది. దీంతో స్వదేశీ క్రయోజెనిక్‌ ఇంజిన్ల అభివృద్ధి చేయాలన్న భారత్‌ ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చాయి. అయితే, ఆంక్షల నేపథ్యంలోనూ అదనపు వ్యయంతో ఏడు క్రయోజెనిక్‌ ఇంజిన్లు, మాక్‌ఆప్‌ టెస్టింగ్‌ పరికరాలను ఆ కంపెనీ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. అనంతరం తిరువనంతపురంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టం సెంటర్‌ను ఏర్పాటు చేసి స్వదేశీ ఇంజిన్లను రూపొందించింది. తొలి స్వదేశీ వాహ క నౌక 2016 డిసెంబర్‌లో సేవలు ప్రారంభిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అది 3.2 టన్నుల బరువు ఉన్న జీశాట్‌ 19ను తీసుకెళ్లనున్నది. ఎంకే-3 రాకెట్‌ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్ల 2500 కిలోల బరువు ఉన్న పేలోడ్‌ను ఎంకే-2 కక్ష్యలో ప్రవేశపెడుతుంది. గతంలో భారీ పేలోడ్లను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఫ్రాన్స్‌ కంపెనీ ఏరియన్‌స్పేస్‌ రూపొందించిన ఏరియన్‌ 6 రాకెట్టును గతంలో ఇస్రో ఉపయోగించుకొనేది. అందుకు 95 మిలియన్‌ డాలర్లను సదరు కంపెనీకి ఇస్రో చెల్లించేది. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎంకే-2ను ప్రయోగించడం వల్ల ఇస్రోకు అయ్యే ఖర్చు సుమారు 40 మిలియన్‌ డాలర్లు మాత్రమే. ఎంకే-3 అందుబాటులోకి వస్తే అమెరికా ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌కు దీటుగా ఎదుగుతుంది. దాంతో 4000 కిలోల పేలోడ్‌ను ఏకంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని ఇస్రో చేజిక్కించుకొంటుంది.