అమిత్ షాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సూటిప్రశ్న
సుప్రీం కోర్టు తీర్పు.. నా వ్యక్తిగతం ఎట్లయితది..?
ఆ 40 పేజీలను చదివితే అమిత్ షాకు అసలు విషయం బోధపడేది
ఉప రాష్ట్రపతి ఎన్నిక రెండు సిద్ధాంతాల మధ్య పోటీ.. వ్యక్తుల మధ్య కాదు
ప్రత్యర్థులను విమర్శించబోనని నేను ముందే ప్రకటించాను
డిబెట్‌లో డీసెస్సీ ఉండాలి.. దేనిపైనా నేరుగా చర్చకు దిగాలనుకోవడం లేదు
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ
న్యూఢల్లీి, ఆగస్ట్23 (జనంసాక్షి) :సుప్రీం కోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పులను వ్యక్తిగతంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆపాదించడంపై ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సుప్రీం కోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పు వ్యక్తిగత హోదాను కలిపి మాట్లాడటం పట్ల కనీస మర్యాద కాదన్నారు. డిబెట్‌లో డీసెన్సీ ఉండాలన్నారు. ప్రత్యర్థులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయబోనని ముందే ప్రకటించానని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీగానే చూడాలని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యంలో లోటు కనిపిస్తోందని, రాజ్యాంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. శుక్రవారం కేరళలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి శనివారం న్యూఢల్లీిలో స్పందించారు. ‘కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశా. కానీ, అది నా తీర్పు కాదు, సుప్రీం కోర్టుది. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు’’ అని జస్టిస్ పేర్కొన్నారు. ఇంతకుమించి దీనిపై చర్చ చేయదలచుకోలేదన్నారు. ప్రత్యర్థులనుగానీ, ఏ రాజకీయ పార్టీని తాను విమర్శించబోనని ముందే ప్రకటించినట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు.
కులగణన అవసరం : జస్టిస్ బీఎస్ రెడ్డి
సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పన కోసం కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ కాదని, రెండు భావజాలాల మధ్య పోటీ అని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ మాత్రమేగానీ, వ్యక్తులు, వారి ఆలోచనల మధ్య సంఘర్షణ కాదన్నారు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవని, దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడం లేదని చెప్పారు. పార్లమెంటు కార్యకలాపాలకు సభ్యులు అప్పుడప్పుడు అంతరాయం కలిగించడం కూడా ఒక విధమైన నిరసన మాత్రమేనని, అయితే ప్రజాస్వామ్య పక్రియలో అది అంతర్భాగంగా మాత్రం మారకూడదన్నారు. ఒకప్పుడు లోటు, ఆర్థిక వ్యవస్థ గురించి చర్చ జరిగేదికానీ.. ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యంలో లోటు గురించి మాట్లాడుకుంటున్నామని వివరించారు. ‘భారత్ ప్రజాస్వామ్య దేశం కాదని అనడం లేదు. ఇప్పటికీ మనది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమే. అయితే, ప్రస్తుతం అది ఒత్తిడికి గురవుతోందని భావిస్తున్నా’ అని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
బీఎస్ రెడ్డి విస్తృత ప్రచారం
ఇప్పటికే అరవైశాతంపైగా ఓటర్లు మద్దతు తెలిపిన ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో నిలిచిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని దేశవ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు స్వాగతిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తనను ఎన్నుకోవాలని అన్నిపార్టీల ఎంపీలను వినమ్రంగా విన్నవించిన ఆయన.. విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. అందులో భాగంగా నేడు చెన్నై, రేపు లక్నోలో ఆయన పర్యటించనున్నారు. చెన్నైలో సీఎం ఎంకె స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే ఎంపీలతో భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోరనున్నారు. లక్నో పర్యటనలో సమాజ్‌వాది పార్టీ ఎంపీలు, ఇతర ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తనను ఎన్నుకోవాలని దేశప్రజల తరపున రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను కోరనున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ ఎంపీలు డా. మల్లురవి, డా. సయ్యద్ నజీర్ హుస్సేన్ తదితరులు పాల్గొననున్నారు.