కాంగ్రెసొచ్చింది : క్యూలైన్లు తెచ్చింది

 

 

 

 

ఆగష్టు 2(జనం సాక్షి)సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్‌లో పెట్టేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చింది. మళ్లీ క్యూలైన్లను తెచ్చింది’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ హయంలో పదేండ్లు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎరువుల కొరత అనేది కనిపించలేదని, క్యూలైన్లు లేవని గుర్తుచేశారు. సోయిలేని సీఎం, కొందరు మంత్రుల కమీషన్ల దందా యూరియా కొరతకు కారణమని ఆరోపించారు.

చేతకాని పాలన వల్లే యూరియా కొరత: సత్యవతి

నర్సింహులపేట, ఆగస్టు 21: సీఎం రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన, ప్రభుత్వంపై పట్టు లేవని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ సర్కారు చేతకాని పాలన వల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని విమర్శించారు. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటలోని పీఏసీఎస్‌ గోదాం వద్ద గురువారం యూరియా కోసం రైతులు బారులు తీరి ఉండగా ఆమె వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నాట్లు పూర్తి చేసుకున్న రైతులకు యూరియా అవసరముందనే అవగాహనలేని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల దురదృష్టకరమని మండిపడ్డారు.

అసమర్థ కాంగ్రెస్‌ సర్కారు: మాలోత్‌ కవిత

మరిపెడ, ఆగస్టు 21: మహబూబాబాద్‌ జిల్లా ఎల్లంపేటలో యూరియా కోసం రైతులు ధర్నా చేయగా మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ది అసమర్థ పాలన అని విమర్శించారు. రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వానికి రైతుల సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎప్పుడూ రైతులు రోడ్డెక్కిన ఘటనలు లేవని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏజెంట్‌గా కలెక్టర్‌: సుదర్శన్‌రెడ్డి

చెన్నారావుపేట, ఆగస్టు 21: వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. గురువారం చెన్నారావుపేటలోని సహకార సంఘంలో యూరియా కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు కాశారు. యూరియాను కొద్ది మందికే ఇవ్వగా సుమారు 300 మంది రైతులకు అందకపోవడంతో వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి రైతులను శాంతింపచేశారు. సుదర్శన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ యూరియా కొరత లేదన్న కలెక్టర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

రైతులకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి: చిరుమర్తి

నకిరేకల్‌, ఆగస్టు 21: తెలంగాణ రైతన్నలకు యూరియా ఇవ్వలేని సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్‌ చేశారు. మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సొసైటీలకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. రైతుల సహనాన్ని పరీక్షించొద్దని, యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతుల ముందుకు వెళ్లి నిలబడితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, మంత్రులను తరిమి తరిమి కొడతారని చెప్పారు. గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని తాటికల్‌ పీఏసీఎస్‌ గోదాములో యూరియా స్టాక్‌ను పరిశీలించారు. అక్కడే యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ పాలనలో తీరని వ్యథ: ఎర్రబెల్లి

పర్వతగిరి, ఆగస్టు 21: ‘అయ్యా.. యూరియా కోసం అరిగోస పడుతున్నం.. పొద్దటి నుంచి తిండి లేకుండా లైన్‌లో నిల్చున్నం.. ఎరువు ఎప్పుడిస్తారోనని పడిగాపులు కాస్తున్నం.. నాలుగు రోజులుగా తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా దొరకలేదు.. దయచేసి మాకు యూరియా ఇప్పించండి సారూ’ అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముందు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతుల కష్టాలను అర్థం చేసుకుంటలేడు.. వచ్చే స్ధానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో పలు కార్యక్రమాలకు హాజరై వెళ్తుండగా ఎర్రబెల్లితో రైతులు ఆవేదనను చెప్పుకున్నారు. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో రైతులకు సరిపడా యూరియా అందడంతో నిశ్చింతగా ఉన్నామని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు కష్టాలు తీరని వ్యథగా మిగిలాయని మండిపడ్డారు.

సర్కారుకు ప్రణాళిక లేదు: రెడ్యానాయక్‌

కురవి, ఆగస్టు 21: కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు ముందస్తు ప్రణాళిక లేదు.. వ్యవసాయంపై ముఖ్యమంత్రి, మంత్రులకు పరిజ్ఞానం లేదని డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని సొసైటీ ఆధ్వర్యంలో యూరియా బస్తాల కోసం సంత ఆవరణలో ఉన్న రైతులతో రెడ్యానాయక్‌ మాట్లాడారు. వ్యవసాయ అధికారి నర్సింహారావు, రూరల్‌ సీఐ సర్వయ్యను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. కురవి సొసైటీకి 444 బస్తాలు వస్తే.. 2000 మంది రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఓట్లేయించుకుని గెలిచిన నాయకులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. దేశంలో యూరియా లేకపోవడం కాదని, సీఎంకి అవగాహన లేకపోవడం వల్లనే రైతులు గోస పడుతున్నారని మండిపడ్డారు.