ఇస్రో రాకెట్ ప్రయోగం విఫలం
సాంకేతిక సమస్యలే కారణమన్న ఛైర్మన్ శివన్
బెంగళూరు,ఆగస్ట్12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ `ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో రాకెట్‌లో సమస్య ఎదురైంది. జీఎస్‌ఎల్‌వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడిరచారు. రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. జీఎల్‌ఎల్‌వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. నెల్లూరులోని శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ`ఎఫ్10 రాకెట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ మూడో దశలో విఫలమైనట్లు కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత మిషన్ విఫలమైనట్లు పేర్కొన్నారు. క్రయోజెనిక్ దశలో సమస్యతో ప్రయోగం విజయవంతం కాలేదని మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి రాకెట్ ప్రయోగం గతేడాది లోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి, సాంకేతిక సమస్యలతో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్‌ఎల్‌వీ`ఎఫ్10 రాకెట్ ద్వారా జీఐశాట్`1 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోవిూటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది.