ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు

 స్తంభించిన జనజీవనం
పొంగిపొర్లుతున్న వాగులు, నదులు
పలు ప్రాంతాల్లో విరిగిపడుతున్న కొండచరియలు
రైళ్ల రాకపోకలకు అంతరాయం
అగర్తలా, జూన్‌14(జ‌నం సాక్షి) : నైరుతి రుతపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురిసి భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ఈశాన్య రాష్ట్రాల్లోని వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు అసోం, మణిపూర్‌, త్రిపురలో కొండచరి యలు విరిగిపడి కొన్ని ప్రాంతాలలతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో ఈశాన్య సరిహద్దు రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అస్సాంలోని లండింగ్‌-బదార్‌పూర్‌ మార్గంలో కొండచరియలు విరిగిపడి, సొరంగాలు మూసుకుపోయాయి. దీంతో త్రిపుర, అస్సాం రైలు మార్గంలో అంతరాయం ఏర్పడింది. బంగ్లాదేశ్‌ సరిహద్దులోని బరాక్‌ లోయలో వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో పడవ ప్రయాణాలను రద్దు చేస్తున్నట్టు అస్సాం జల రవాణా విభాగం ప్రకటించింది. అస్సాంలోని ఆరు జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ జిల్లాలోలని 10 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గువహటి డివిజన్‌లోని నదుల్లో నీటి మట్టాలు పెరిగాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఐడబ్యూటీ డైరెక్టర్‌ భరత్‌ భూషణ్‌ వెల్లడించారు. బరాక్‌ లోయలోని 30 వేల మంది ప్రయాణికులపై వరద ప్రభావం పడిందని ఆయన తెలిపారు. లండింగ్‌-బందార్‌పూర్‌ కొండ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతో ఐదు చోట్లు కొండచరియలు విరిగిపడినట్టు ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్‌ పీఆర్‌ఓ పీజే శర్మ తెలియజేశారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 3.30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి పట్టాలపై పడటంతో ఆ దారిలో వెళ్లే రైళ్లను రద్దుచేసినట్టు సీపీఆర్‌ఓ శర్మ వివరించారు. గువహటి- సిల్చార్‌ ఫాస్ట్‌ పాసింజర్‌, సియాల్దా- సిల్చార్‌ కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌, అగర్తలా- సియాల్దా ఎక్స్‌ప్రెస్‌, సిల్చార్‌- గువహటి ఫాస్ట్‌ పాసింజర్‌ రైళ్లను రద్దుచేశారు. త్రిపురలోనే మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ బుధవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉనాకోటిలోని వరద బాధితుల పునరావస శిభిరాన్ని సందర్శించిన ఆయన అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోమతి, దియో, మను, హవోరా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ సైతం జలమయమైంది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడిన రైలు మార్గంలో వాటిని తొలగించే పనులు కూడా ప్రారంభించారు.