ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి):
మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారంనాడు ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ విఎస్‌ సంపత్‌ మీడియాకు తెలిపారు. త్రిపురలో ఫిబ్రవరి 14న పోలింగ్‌ జరగనున్నట్టు తెలిపారు. మేఘాలయ, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 23న ఎన్నికలు జరగనున్నట్టు చెప్పారు. మూడు రాష్ట్రాల్లోని ఎన్నికల లెక్కింపు మాత్రం ఫిబ్రవరి 28న జరగనున్నట్టు వివరించారు. అదే రోజు ఫలితాలు
వెల్లడవుతాయని తెలిపారు. త్రిపురలో నామినేషన్ల ప్రక్రియ జనవరి 28తో పూర్తవుతుందన్నారు. నాగాలాండ్‌, మేఘాలయలలో నామినేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 6వ తేదీతో ముగుస్తుందని వెల్లడించారు.మేఘాలయ అసెంబ్లీ గడువు మార్చి 10తోను, త్రిపుర అసెంబ్లీ గడువు మార్చి 16తోను, నాగాలాండ్‌ అసెంబ్లీ కాలపరిమితి మార్చి 18తోను ముగియనున్నది. ఇదిలా ఉండగా త్రిపురలో గత పదిహేనేళ్లుగా వామపక్ష కూటమి అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాల్లోను, నాగాలాండ్‌లోని 60 స్థానాల్లోను, మేఘాలయలోని 60 స్థానాల్లోను ఎన్నికలు జరగనున్నాయి.