ఈ నెల 15 నుంచి సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని  ఎస్వీ డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల 15  నుండి 31వ తేది వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించేందుకు ఆర్మీ అధికారులు కల్నల్ కీట్స్ దాస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలిసి ఎస్వీ డిగ్రీ కాలేజ్ నందు శుక్రవారం సమీక్ష సమావేశంను నిర్వహించారు.ఆర్మీ ర్యాలీ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి అభ్యర్థులు ర్యాలీకి హాజరవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల ఏర్పాట్లు చేయాలని,రిక్రూట్మెంట్ జరిగే ప్రాంతంలో ప్రజలు గుమిగూడకుండా చూడాలని,డిఫెన్స్ అకాడమిల ప్రకటనలు లేకుండా చూడాలని పోలీసు శాఖ వారికి కల్నల్ కీట్స్ కె దాస్ విజ్ఞప్తి చేశారు.బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్ల ఏర్పాటు,మెటల్ డిటెక్టర్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.గ్రౌండ్ తయారీ ,  గ్రౌండ్ లో బారికేడ్లు , లైటింగ్ , మైక్ లు , మంచినీటి సరఫరా , అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లపై పర్యవేక్షించారు.ఎలక్ట్రిసిటీ కేబుల్స్ సురక్షితంగా ఏర్పాటు చేయాలని, జనరేటర్ల ఏర్పాటు , సిసి కెమెరాలు , కంప్యూటర్లు , సర్వర్  నిర్వహణపై సమీక్ష జరిపారు.గాయపడిన అభ్యర్థులకు అత్యవసర పరిస్థితిలో మెరుగైన వైద్య చికిత్స అందించడానికి వైద్య బృందాలు సిద్దంగా ఉండాలని,ప్రాథమిక చికిత్స కొరకు క్యాంపు ఏర్పాటుతో పాటు, రెండు అంబులెన్స్ లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.విఐపిలకు సభా ప్రాంగణం ఏర్పాటుపై సమీక్ష జరిపారు.రిక్రూట్మెంట్ ర్యాలికీ హాజరయ్యే ఆర్మి అధికారులకు సమీప రైల్వే స్టేషన్ నుండి రవాణా ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.వర్షం వస్తే తట్టుకునే విధంగా వాటర్ ప్రూఫ్ టెంట్ లను ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేజర్ తరణ్ జీత్, సుబేదార్ మేజర్ శివాజి లాల్ జాట్, దీపక్ రావత్,డిఎస్పీ నాగభూషణం, ఆర్డిఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి , ఆర్టిఓ వెంకటయ్య , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట రమణ, ఆర్ అండ్ బి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.