ఈ వేట ఆపమని నినదిద్దాం బాలగోపాల్ స్మృతిలో..
దంతెవాడ జిల్లాలోని సంఘర్షణ ఎప్పటిలాగే భద్రాచలం డివిజన్‌లో ప్రతిధ్వనించడం మొదలైంది. చింతూరు నుంచి వాజేడు దాకా పోలీసులు ఆదివాసులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు రప్పించి అక్రమంగా నిర్భంధించి తీవ్రంగా హింసించి బైండోవర్ చేస్తున్నారు. ఇక్కడే పరిస్థితి ఇట్లా ఉంటే దంతెవాడలో ఎట్లా ఉంటుందో ఊహించకోవచ్చు. అందుకే ప్రభుత్వం ఈ వేట ఆపాలని అందరమూ నినదించడం అవసరం.
గ్రీన్ హంట్ మొదలైంది. హోం మంత్రి చిదంబరం సెప్టెంబర్‌లో మొదలు పెడతామని చెప్పి నవంబర్‌కు వాయిదా వేసిన మావోయిస్టుల ఏరివే కారక్రమం మొదట అనుకున్నట్టుగా సెప్టెంబర్‌లోనే ప్రారంభమైంది. ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చే వార్తల విశ్వసనీయత స్వల్పమే కాబట్టి ఎంత మంది కోబ్రాలు దంతెవాడ జిల్లాలోకి ప్రవేశించారు. కేంద్రం ఎన్ని బెటాలియన్ల పారా మిలిటరీని పంపింది, కాల్పుల్లో ఇప్పటికీ ఇటు అటు వైపు ఎంతమంది చనిపోయారు ఇత్యాది విషయాలపై పత్రికలు ఇస్తున్న గణాంకాలు పూర్తిగా సత్యాలు కాకపోవచ్చును.
సిబ్బంది సంఖ్య తెలుసుకోవడం కొంచెం ప్రయత్నం చేస్తే అసాధ్యం కాకపోవచ్చును. గానీ మరణాల గురించి ఆ మాట అనలేం. మరణానికి సాక్షి మృత దేహం. కానీ ఛత్తీస్‌గడ్ పాలకులు తమ వారి మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకొని పంచనామా, పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మావోయిస్టులు, వారి సానుభూతి పరుల మృతదేహాలను అడవి జంతువులకు వదిలేసి రావడం తరచుగా జరుగుతుంది. ఒక సంవత్సరం క్రితం వరకు ఎప్పడూ అదే జరిగేది. ఈ మధ్య కొన్ని సందర్బాల్లో వారి మృతదేహాలను కూడా తీసుకొచ్చి పంచనామా చేస్తున్నాట్టున్నారు.
చనిపోయిన వారు సాయుధ నక్సలైట్లు కాక గ్రామీణ ప్రజలైతే, వారి మృతదేహాలను అడవిలోనే వదిలేయడం పాలకుల దృష్టిలో తెలివైన పని. నిజంగా సాయుధ కార్యకర్తలైనా కూడా, ఆ విద్రోహుల శవాలకు ఇన్ని మర్యాదులు, దానికోసం తమకింత అనవసరం అన్న అభిప్రాయం ఛత్తీస్‌గడ్ పాలనా యంత్రాంగంలో ఉన్నట్టుంది. శ్రీలంకలో ఎల్‌టీటీపైన జరిగిన పోరులో చనిపోయిన తమిళుల మృతదేహాలకు జరిగిన పంచనామాలో వారిని చిత్రహింసలు పెట్టి చంపిన దాకాలాలున్నాయని బయటిపడిన తరువాత, పంచనామా చేయకుండ ఖననం చెయొచ్చనని ఆ దేశ ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది.
మన ప్రభుత్వాలు అటువంటి ఆదేశాలు జారీ చేయడానికి రాజ్యాంగం అడ్డం రావచ్చును కాబట్టి అలిఖిత ఆదేశాల ద్వారా ఛత్తీస్‌గడ్ పాలకులు దానిని అమలుచేస్తున్నారు. మీడియా ఆ ఛాయలకు రాకూడదని ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం తాఖీదు జారీ చేసిందని కూడా పత్రికలు చెప్తున్నాయి. గ్రీన్‌హంట్ వేటాడబడుతున్నది సాయుధులా లేక వారి వెంబడి ఉన్న ఆదివాసులా అన్నది బయటిపడకుండ ఉండడానికి ఈ ఆంక్షసహితం అవసరం అని రమణ్‌సింగ్ ప్రభుత్వం భావించినట్లుంది. ఈ ఆంక్షను ధిక్కరించే ధైర్యం మీడియాకు ఉంటే గెలగలరు.
ఎందుకంటే పత్రికా స్వేచ్ఛలో భాగం అని సుప్రీం కోర్టు రాజ్యాంగం రాసిన తొలినాళ్లలోనే వ్యాఖ్యానించింది. దానిని రాజ్యాంగం ఆమోదించిన పరిమితుల మేరకు , అదీ చట్టం చేసి, నియంత్రించవచ్చును గానీ ఏ కారణం చూపించకుండ జీవోల ద్వారా మీడియాను నిషేధించే అధికారం ప్రభుత్వానికి లేదు. తుపాకులు పట్టుకొని అడ్డం నిలబడ్డ కోబ్రాలతో రాజ్యాంగాన్ని గురించి వాదించి ప్రాణాలతో బయటపడడం సాధ్యమని కాదుగానీ, కనీసం ఈ ఆంక్ష చట్టరీత్యా అక్రమం అని తెలుసుకోవడం అవసరం. లేకపోతే మీడియాను రానివ్వం అని ప్రభుత్వాలు ఒక దాని తరువాత ఒకటి నిషేధాలు పెట్టడం మొదలు పెడితే ప్రజాస్వామ్యానికి చాలా నష్టం.
లాల్‌గడ్‌లో వామపక్ష ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అయితే ఈ విషయంలోనూ శ్రీలంక ఇన్ప్‌పిరేషన్ ఉన్నట్టుంది. ఎల్‌టీటీఈ పైన పోరులో చివరి మూడునెలల్లో శ్రీలంక పాలకులు మీడియాను, దేశ ఉత్తర ప్రాంతానికి రానివ్వలేదు. ఆ దశలో 20 వేల మంది సాధారణ తమిళ పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి అధికారులు ఆంతరంగిక ఉత్తరప్రత్యుత్తరాల్లో చెప్పుకున్న విషయాన్ని చూస్తే శ్రీలంక పాలకుల ఉద్దేశ్యం అర్థం అవుతుంది. శ్రీలంక ప్రస్తావన ఇప్టటికే రెండు సార్లు వచ్చింది. మూడవ సారీ వస్తేగానీ కత పూర్తి కాదు.
ఎల్‌టీటీ సైనిక పతనం తరువాత ఇండియా పాలకులకొక ధైర్యం వచ్చింది. మిలిటెంట్ రాజకీయ పోరాటాలతో శాంతి చర్చలు, రాజకీయ పరిష్కారాలూ అక్కర్లేదని గట్టిగా పూనుకుంటే వారిని భౌతికంగా ఏరివేయవచ్చునని ఇప్పుడు మన పాలకులు కూడా నమ్ముతున్నారు. అప్పటికే దేశ అంతరంగిక భద్రతకూ ప్రధాన ప్రమాదం అని ప్రకటించబడ్డ మావోయిస్టులను ఏరివేయాలన్న సంకల్పం దీనితో బలపడింది. దేశ ఆంతరంగిక భద్రతకూ మావోయిస్టుల కంటే పాలక పార్టీల అవినీతి, అక్రమ పరిపాలన అసమానతలను వికృతంగా పెంచుతున్న ఆర్థిక విధానాలు ఎక్కువ ముప్పు కాదా అని సాధారణ మానవులకు సహితం సందేహం రావొచ్చు.
కానీ ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న అయిన మాజీ ఆర్థిక మంత్రి దేశ అభివృద్ధి విధాన కర్తల్లో ఒకడు అయిన చిదంబరానికి తెలిసిన విషయమేమిటంటే ఆంతరంగిక భద్రత సంగతి ఎట్లాగున్నా మధ్య భారత అడవి ప్రాంతాల్లోని అపారమైనా ఖనిజ సంపదను వెలికి తీసీ అభివృద్ధికి వనరుగా వినియోగించే ప్రయత్నానికి మావోయిస్టుల ఉనికి అడ్డం కాగలదని. మావోయిస్టులు తమకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బడా పెట్టుబడి దార్ల ఉనికి విస్తరణకూ అన్ని సందర్బాలల్లోనూ అడ్డుపడలేదుగానీ, అడ్డుపడగలరన్న భయం వల్ల పెట్టుబడి దార్లు ముందుకు రాకపోవచ్చునని ఆ ఆందోళన .
అన్నీ కలిసి మావోయిస్టుల ఏరివేత ప్రక్రియకు దారి తీసాయి. భారీగా పారా మిలిటరీని గెరిల్లా తరహా శిక్షణా పొందిన కోబ్రాలను దించి భౌతికంగా మావోయిస్టులను తుదముట్టిస్తాం అని చిదంబరం టూత్‌పేస్ట్ చిరునవ్వు చెదరకుండ చేస్తున్న సవాలు అమలు కావడం మొదలైంది. ఈ ఏరివేతకు అర్థం ఆదివాసుల హననం కాగలదని నిన్న మొన్న దంతెవాడ కాల్పుల గురించి అరకొరగా వస్తున్న వార్తలు తెలుపుతున్నాయి. అయితే మావోయిస్టులూ అదే భాష మాట్లాడుతున్నారు. తమ తడాఖా చూడమని ప్రభుత్వానికి ఎదురు సవాలు విసురుతున్నారు.
అబుజ్‌మడ్‌లో పారామిలిటరీని దించుతాం అని చిదంబరం ప్రకటించిన రెండవరోజే రాజ్‌నంద్‌గాంలో పోలీసులను పెద్ద సంఖ్యలో చంపారు. సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్న వారు యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయక తప్పదుగానీ ప్రజల మధ్య బతకుతూ యుద్దాన్ని ఆహ్వానించే పనులు చేయకూడదు. నివారించడానికి ఎంత చేయగలిగితే అంత చేయాలి. ఏం చేయవచ్చునంటే చాలా చర్చ పెట్టుకోవచ్చును గానీ అసలు ఆ వైఖరి ఉందా అనేది ప్రశ్న. మావోయిస్టు నాయకులకు ఇటువంటి ప్రశ్నలు నచ్చవు మీరు ఎవరి పక్షం? అని అడుగుతారు.
రాజకీయ పక్షపాతాన్నే కాక విలువల పక్షపాతాన్ని కూడా గుర్తించేట్టయితే మేము న్యాయం పక్షం అని జవాబు చెప్పవచ్చు. న్యాయం ఎక్కువ భాగం ప్రజల కోసం పోరాడేవారి వైపే ఉంటుంది గానీ వారు ప్రజల క్షేమం కంటే తమ రాజకీయ లక్ష్యాన్ని ప్రధానంగా ఎంచినప్పుడు అది న్యాయం అనక తప్పదు. ప్రభుత్వం మాత్రం ఎంతకాలం చూస్తూ ఊరుకుంటుంది అని అడిగే వారూ ఉంటారు. ప్రజల అవసరాల కోసం మిలిటెంట్ పోరాటాలు చేయడం వేరు, రాజ్య సార్వభౌమత్వాన్నే సాయుధంగా సవాలు చేయడం వేరు.
మొదటి దాని పై కొంత ఉదారంగా ఉండగల పాలకులు సహితం రెండవ దాని పై ఉండలేరని అంటారు. మావోయిస్టులైనా రేపు అధికారానికి వస్తే ఇంతకంటే భిన్నంగా నడుచుకుంటారా అని ప్రశ్నిస్తారు. ఇది న్యాయమైన ప్రశ్నేగానీ ఎటువంటి సవాలునైనా ప్రజాస్వామికంగానే ఎదుర్కొవాలనేది ప్రజాతంత్ర వాదులివ్వగల ఏకైక సమాధానం.
దీనికి మార్గం చెప్పమని కోరుతూ 11వ ప్రణాళిక సంఘం ఒక నిపుణుల కమిటీని నియమించగా మావోయిస్టుల వల్ల ప్రజలు ఏ హక్కులు, ఏ స్వతంత్రం, ఏ జీవనావకాశాలు పొందారో అవినీ సార్వభౌమాధికారాన్ని వినియోగించి నువ్వే కల్పించడం ఒక్కటే వారిని ప్రజాస్వామికంగా ఎదుర్కొనే మార్గం అవుతుందని వారు చెప్పడం జరిగింది.
మన్మోహన్ సింగ్‌గానీ చిదంబరం గానీ ఆనివేదిక చదివిన దాఖలాలు లేవు. చివరిగా దంతెవాడ జిల్లాలోని సంఘర్షణ ఎప్పటిలాగే భద్రాచలం డివిజన్‌లో ప్రతిధ్వనించడం మొదలైంది. చింతూరు నుంచి వాజేడు దాకా పోలీసులు ఆదివాసులను బలవంతగా పోలీస్ స్టేషన్‌కు రప్పించి అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించి బైండోవర్ చేస్తున్నారు.
చర్ల పోలీసులు చేతులూ కాళ్లూ కట్టి కొక్కానికి వేళ్లాడదీసి చితకగొట్టిన ఆర్ కొత్తగూడెం కాలనీ వాసి కొమురం నరసింహారావు, మళ్లీ ఏం చేస్తారో అన్న భయానికి ఈనెల 7వ తేదిన తన ఊరి సమీపంలో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఇక్కడే పరిస్థితి ఇట్లా ఉంటే దంతెవాడలో ఎట్లా ఉంటుందో ఊహించకోవచ్చు. అందుకే ప్రభుత్వం ఈ వేట ఆపాలని అందరమూ నినదించడం అవసరం. మావోయిస్టులూ ఆ దిశగా ఒత్తిడి పెంచే పద్దతిలో నడుచుకోవాలని కోరడమూ అవసరం.