ఉగాది నుంచి.. వరంగల్‌కు ఉచిత మంచి నీరు

 

– ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి): గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, మున్సిపల్‌ శాఖ, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నుంచి వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోజూ తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌ నగర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. మరింత వేగంగా వరంగల్‌ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్లాలని కేటీఆర్‌ సూచించారు.

డబుల్‌ బెడ్రూం ఇండ్ల పురోగతిపై సవిూక్ష

కార్పొరేషన్‌ పరిధిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల పురోగతిపై కేటీఆర్‌ సవిూక్షించారు. ఇప్పటికే దాదాపు 800 ఇండ్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లు అందించే కార్యక్రమం చేపడుతామని మంత్రులు చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణం, అర్బన్‌ పార్కులు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం వంటి కార్యక్రమాలను కార్పొరేషన్‌ పరిధిలో కొనసాగించాలన్నారు. వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు. వరంగల్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయిస్తోందన్నారు. వరంగల్‌ నగర అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.