ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
– మలేషియా, భారత్ పరస్పర సహకారం
కౌలాలంపూర్, నవంబర్ 23 (జనంసాక్షి):
మలేసియాతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటామని, ఇరు దేశాల మధ్య సబంధాలు మరింత బలోపేతం చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. వాణిజ్యం, పెట్టుబడులు, మౌలికసదుపాయాలు, రక్షణ రంగం, సైబర్ సెక్యూరిటీ విషయంలో పరస్పర సహకారం అవసరమన్నారు. ఇరుదేశాల మధ్య తరచూ ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తామన్నారు. మలేసియాలో ప్రధాని నరేంద్రమోదీ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత్-మలేసియా ప్రధానుల ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ…. ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల పెంపునకు కృషి చేస్తామన్నారు. భారత్‌లో చదువుకునేందుకు మలేసియా విద్యార్థులను ఈసందర్భంగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్-మలేషియాలు భద్రత విషయంలో పకడ్బందీగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య రక్షణపరమైన సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తీవ్ర వాదాన్ని, జాతి వివక్షతను రూపుమాపడంలో మలేషియా చర్యలు అద్భుతం అన్నారు. ఇస్లాం మత అసలైన విలువలు ఎత్తిచూపడంలో మలేషియా అగ్రభాగాన ఉందన్నారు. మూడు రోజుల ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా మలేషియాలో ఉన్న మోదీ సోమవారం ఉదయం కౌలాలంపూర్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పుత్రజయ వద్ద మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ దేశ సైనికులు గౌరవ వందనం చేశారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ, నజీబ్ మధ్య ముఖ్యంగా రక్షణ, సైబర్ సెక్యూరిటీవంటి అంశాలు చర్చకు రావడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మలేషియా సహకారాన్ని కోరారు. భారత్ లో పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా మర్చనున్న నేపథ్యంలో వాటి నిర్మాణం కోసం సహకారం అందించాలని కూడా మోదీ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మలేషియా విద్యార్థులు భారత్ లో చదువుకునేందుకు రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని నజీబ్ కలిసి లిటిల్ ఇండియాగా భావించే కౌలాలంపూర్ లో తోరణ గేట్ ను ప్రారంభించారు. భారత స్మృతి చిహ్నం సాంఛీ స్తూపాన్ని పోలి ఉండేలా దీనిని నిర్మించారు. 2010 దీని నిర్మాణంపై ప్రకటన చేసి పూర్తిగా భారత్ నిధులతో దీనిని నిర్మించారు. దీని ప్రారంభానికి మోదీ వచ్చిన సందర్భంగా అక్కడి భారతీయులు, మలేషియా పౌరులు భారీ సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొన్నారు. మోదీని చూసేందుకు పోటీపడ్డారు. తోరణ గేట్ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది కేవలం రాతి కట్టడం మాత్రేమే కాదని ఇరు దేశాలకు సంస్కృతికి ప్రతిబింబం అని కొనియాడారు. తోరణ గేట్ ను ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.