ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం

http-%2f%2fcom-ft-imagepublish-prod-us-s3-amazonawsటెర్రిజాన్ని ప్రోత్సహించి ఆశ్రయం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్, బ్రిటన్ ముక్తకంఠంతో పిలుపునిచ్చాయి. సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ వైపు పరోక్షంగా వేలెత్తి చూపిన ఉభయదేశాల నేతలు భారత్‌లో 2008, 2016 సంవత్సరాల్లో ముంబై, పఠాన్‌కోట్‌లలో జరిగిన ఉగ్రదాడులను ఖండించారు. దాడి బాధ్యులను బోనెక్కించాలని పాక్‌కు విజ్ఞప్తి చేసారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఇటీవల కశ్మీర్‌లోని యురీ సైనిక శిబిరంపై జరిగిన దాడిని ప్రత్యేకంగా ఖండించారు. ఆమె రాక సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో మానవతకు ఉగ్రవాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన కశ్మీరీ మిలిటెంటు బుర్హాన్ వనీని పాక్ అమరవీరుడని పొగడడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఉగ్రవాదుల్లో మంచివారు, చెడ్డవారు అని వేరువేరుగా ఉండరని సంయుక్త ప్రకటన నొక్కిచెప్పింది.