ఉగ్రవాదులకు…దుండగులకు సంబంధం లేదు:నాయిని నరసింహారెడ్డి

8l5r42sqహైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దుండగులకు.. సిమి ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఎదురు కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ, సీఐ ని పరామర్శించారు. నాయినితో పాటు డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఉన్నారు. వీరు మీడియాతో మాట్లాడుతూ.. కాల్పుల్లో చనిపోయిన పోలీసు కుటుంబాలకు రూ.40లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతే కాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరును మీడియాకు వివరించారు. పోలీసులపై దాడికి తెగబడింది యూపీ దొంగల ముఠా గా అనుమానిస్తున్నామని… విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని స్పస్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అరాచక శక్తులను కూకటి వేళ్లతో అణచి వేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడిన నల్గొండ జిల్లా పోలీసులకు నాయిని అభినందనలు తెలిపారు.