ఉగ్రవాదులు ఇస్లాంకు వ్యతిరేకం

1
– భారత మత పెద్దల ఫత్వా జారీ

న్యూఢిల్లీ,నవంబర్‌21(జనంసాక్షి): ఉగ్రవాద చర్యలకు ఇస్లాం వ్యతిరేకమని, ముస్లిం యువకులు ఐసిస్‌లాంటి వలలో పడవద్దని మత గురువులు పిలునిచ్చారు. పారిస్‌పై దాడి సహా ఐసిస్‌ ఉగ్రవాద చర్యలను భారతీయ ముస్లింలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు ఫత్వా జారీ చేశారు.దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని మజీదుల్లో శుక్రవారం నాటి ప్రార్థ నల అనంతరం మతగురువులు తమ వైఖరిని స్పష్టం చేశారు. ఇలా తీవ్రవాద చర్యలకు ఒడిగడుతూ మానవ హననాన్ని ఇస్లాం అంగీకరించదన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో లోని ఆసిఫీ మజీద్‌లో  షియా ముస్లిం మతుగురువుల సంస్థ మజ్లిస్‌ వులేమా యేహిన్‌ ఉగ్రవాద చర్యలకు నిరసన వ్యక్తం చేసింది. పారిస్‌పై ఐసిస్‌ ఉగ్రవాదుల దాడులను వారు ఖండించారు. షియాలు, సున్నీలు అన్న భేదం లేకుండా అన్ని తెగలవారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఐకమత్యంగా నిరసన ప్రకటించాలని వారు పిలుపునిచ్చారు. ఆగ్రా నగరానికి చెందిన సుంకుల్‌ ముస్లిం సంస్థ పారిస్‌పై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఇస్లాం పేరుతో అమాయక పౌరులను చంపటం మతానికి చెడ్డపేరు తెస్తోందని సంస్థ సభ్యులు మండిపడ్డారు. వివిధ దేశాల్లో ఐసిస్‌ ఘాతుకాలను ఖడిస్తున్నామని ప్రకటించారు. ఇస్లాం మానవత్వాన్ని సమర్థిస్తుంది తప్ప హింస, అసహనాలను సమర్థించదని బెంగళూరు జావిూదు మజీద్‌ ఇమామ్‌ మక్సూద్‌ ఇమ్రాన్‌ అన్నారు. ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. పారిస్‌పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఐసిస్‌ చర్యలను వ్యతిరేకిస్తూ అన్ని మజీదుల్లోనూ మతపెద్దలు బోధనలు చేయాలని పిలుపునిచ్చారు.