ఉచితాలు వద్దంటూ కార్పోరేట్లకు మాఫీ

పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం అవుతుందా
బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల
నిజామాబాద్‌,సెప్టెంబర్‌1 జనం సాక్షి   : పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడం ఉచితాలని అంటామా అని ప్రశ్నించారు. వేలకోట్ల మాఫీలకు లేని ఆంక్షలు పేద ప్రజలపై మాత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడిరదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అగ్రహం ఎన్నికలపై పడుతుందని గమనించి రెండువందలు తగ్గించారని అన్నారు. తగ్గింపు కేంద్రం చేతిలో ఉంటే ఇంతకాలం ఆయిల్‌ కంపెనీలపై ఎందుకు నెపం మోపారని ప్రశ్నించారు. ఇదంతా ఓ డ్రామా అన్నారు. ఎన్నికలు కాగానే దానిని 400కు పెంచినా ఆశ్చర్యం ఉండదన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పేదలకు రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. ఇక్కడ డిక్లరేషన్‌ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలో అమలు చేసి చూపాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్దిదారులకు పింఛన్లు అదిస్తున్నామని చెప్పారు. ఎవరూలేని వారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నాయని వెల్లడిరచారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పింఛన్లు ఇచ్చి సీఎం
కేసీఆర్‌ అండగా ఉంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారని వెల్లడిరచారు. సొంతజాగాలో ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. దీంతో గ్రామాల్లో ప్రజలకు సొంతింటి అవకాశం రాగలదని అన్నారు. ఇప్పటికే  ఉద్యోగాల భర్తీకి నియామక పక్రియ ప్రారంభించారని చెప్పారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పరని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా రూ. 2016ల  పెన్షన్‌ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితాలు బంద్‌ చేయాలంటున్నారని.. కానీ బడా కంపెనీల వాళ్లకు మాత్రం రూ.12 లక్షల కోట్లు మాఫీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాటలు తప్ప చేతలు లేవని వ్యాఖ్యలు చేశారు.