ఉత్తమ్ నియామకంతో జిల్లాకు రెండు ప్రధాన పదవులు
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం
నల్లగొండ,మార్చి2(జనంసాక్షి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా నియమితులైన ఆ పార్టీ సీనియర్ నేత, హుజుర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివాద రహితుడే గాకుండా ఉత్తముడన్న పేరుంది. ఆయన నియామకంతో జిల్లా కాంగ్రెస్‌లో హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లాకు చెందిన వ్యక్తి పిసిసి చీఫ్‌గా, సిఎల్పి నాయడిగా జానారెడ్డి కొనసాగడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తముడు అని నానుడి. వివాదరహితుడిగా మంచి పేరుంది. రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉన్నారు. అంతే కాకుండా ఆర్మీలో వివిధ పదవుల్లో సుదీర్ఘంగా పని చేసిన అనుభవం ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లో మిగ్ విమానాలకు పైలెట్‌గా పని చేశారు. రాష్ట్రపతి భవన్ సెక్యూరిటీ చీఫ్‌గా సేవలందించారు. వైఎస్ హయాంలో 610 జీఓ చైర్మన్‌గా సేవలందించారు. కోదాడ నుంచి రెండు సార్లు, హుజూర్‌నగర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విభజనకు పూర్వం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 1962 జూన్ 20న జన్మించారు. ఆయన స్వస్థలం తాటిపాముల గ్రామం, తిరుమలగిరి మండలం, నల్లగొండ జిల్లా. ఉత్తమ్ భార్య పద్మావతి. ప్రస్తుతం కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పద్మావతి కొనసాగుతున్నారు. దీంతో జిల్లాలో ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇది ఆయన నిస్వార్థ సేవకు నిదర్శనమన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క నియామకం అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రికి వారిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు సోనియాకు రుణపడి ఉంటానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విూడియాతో తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీనియర్లందర్నీ కలుపుకుని పోతానని, ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్యయ్యకు ఆ పార్టీ అధిష్టానం పెద్ద షాక్‌నిచ్చింది. టీ పీసీసీ పదవి నుంచి పొన్నాల లక్ష్మయ్యను అధిష్టానం తొలగించింది. సాధారణ ఎన్నికల కంటే ముందు పొన్నాలకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పిన విషయం విదితమే. అనంతరం సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర విఫలం చవి చూసింది. ఎన్నికల అనంతరం కూడా పొన్నాల పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదని విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని దిగ్విజయ్‌సింగ్ పలు మార్లు ఆదేశించారు. అయినప్పటికీ సభ్యత్వ నమోదులో విఫలం కావడం.. ఆ పార్టీకి చెందిన నేతలే పొన్నాలను విమర్శించడం ఆయనకు మైనస్ అయ్యాయి. పొన్నాల పీసీసీ పదవిలో కొనసాగితే పార్టీ నాశనం కావడం ఖాయమని అదే పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పార్టీ నేతలందరినీ సంప్రదించి పీసీపీ నియామకంపై నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండు అని అన్నారు. పార్టీలో 50 శాతం బీసీలున్నారని, వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు.