ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే
సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఉందని, వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని సబ్ కలెక్టర్ భారతి అన్నారు. శుక్రవారంనాడు ఆమె స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. పదవ తరగతి చదివే 170 మంది బాలికలకు పరీక్షలు ఎలా రాస్తే ఉత్తీర్ణ సాధిస్తారో వారికి వివరించారు. ప్రాథమిక విద్యార్థులకు పూనాది వంటిదని, విద్యార్థి దశ నుండే విద్యను చక్కగా చదువుకోవాలని అన్నారు. మెరుగైన విద్యను అందించి పాఠశాలలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేసి, ప్రైవేటీ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణతా శాతాన్ని పెంచాలని అన్నారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఈ ప్రాంతంలో విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి ఆబ్జక్ట్ టైప్ పేపరు ఎలా పూర్తి చేయాలో ఆమె విద్యార్థులకు వివరించారు. 50 రోజుల్లో టెన్త్ పరీక్షలు రానున్నాయని, ఉపాధ్యాయులు ఒక ప్రణాళికను నిర్ణయించుకొని విద్యార్థులకు మంచి విద్యను బోధించాలని ఆమె కోరారు. ఏగ్రేడ్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తామని ఆమె తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించి విద్యార్థులతో పాటు ఆమె సహపంతి భోజనం చేశారు. మెస్‌ల్లో విద్యార్థులకు పౌష్ఠికాహారాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయులను ఆమె సూచించారు.